రాహుల్ ట్విట్టర్ ఖాతా తొలగింపు 

కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. రాహుల్ ఇటీవల ఇక్కడ ఓ దళిత కుటుంబాన్ని కలుసుకున్న ఫోటోను ట్విట్టర్‌లో పెట్టడం వివాదాస్పదం అయింది. ఈ కుటుంబానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక లైంగిక అత్యాచారానికి గురై తరువాత మరణించింది. కుటుంబ సభ్యులను రాహుల్ పరామర్శించారు. 

‘ఆమె తల్లిదండ్రుల కన్నీళ్లు ఒకటే చెబుతున్నాయి. ఈ దేశపు కూతురికి న్యాయం జరగాలి. అందుకు నేను వారి వెంటే ఉంటాను. ఒక్క అంగుళం కూడా వెనక్కి వెళ్లను’ అంటూ రాహుల్ ఈ సందర్భంగా ట్విట్ చేశారు. 

ఈ విధంగా బాధితురాలి కుటుంబ సభ్యుల ఫోటోను ట్విట్టర్‌లో ఉంచడం నిబంధనలకు విరుద్ధం అని ఒక్కరోజు క్రితమే ట్విట్టర్ అధికారికంగా ఆక్షేపించింది. తదనంతర పరిణామంగా ఆయన ట్విట్టర్ ఖాతాను నిలిపివేసిందని భావిస్తున్నారు. ఈ ఫోటోను పొందుపర్చడంపై చర్య తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ సంఘం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇది జువైనెల్ జస్టిస్ యాక్ట్‌కు విరుద్ధం, పోస్కో చట్టానికి వ్యతిరేకం అని పేర్కొంది. ట్విట్టర్ ఖాతా స్తంభనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఖాతా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు, అంతవరకూ ఇతర వేదికల నుంచి రాహుల్ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజా సమస్యలపై స్పందిస్తారని తెలిపింది.