ఈ వారం 8 బిల్లులను ఆమోదించిన రాజ్యసభ

గత నెల 19న పార్లమెటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి గడచిన మూడు వారాల్లో ఒక్క రోజు కూడా సజావుగా కార్యకలాపాలు సాగిన పాపాన పోలేదు. పెగాసస్ వ్యవహారం, వివాదాస్పద వ్యవసాయ బిల్లులు, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఇలా అనుక సమస్యలపై ప్రతిపక్షాలు రోజూ గొడవ చేయడం, ఉభయసభలు నాలుగైదు సార్లు వాయిదా పడిన తర్వాత మరుసటి రోజుకు వాయిదా పడిపోవడం సర్వ సాధారణమైంది. 

అయితే శుక్రవారంతో ముగిసిన మూడో వారంలో రాజ్యసభ ఎనిమిది బిల్లులను ఆమోదించడంతో పెద్దల సభ ఉత్దాకత 24.2 శాతానికి పెరిగింది. రెండో వారంలో ఉన్న 13.70 శాతం ఉత్పాదకతతో పోలిస్తే ఇది ఎక్కువే. కాగా సమావేశాల మొదటి వారంలో రాజ్యసభ అత్యధికంగా 32.20 శాతం ఉత్పాదకతను నమోదు చేసినట్లు రాజ్యసభ రీసెర్చ్ విభాగం గణాంకాలను బట్టి తెలుస్తోంది.

మొత్తం మూడు వారాల్లో పెద్దల సభ ఉత్పాదకత 22.60 శాతంగా ఉందని రాజ్యసభ అధికారి ఒకరు చెప్పారు. శుక్రవారంతో ముగిసిన గడచిన వారంలో17 పార్టీలకు చెందిన 68 మంది సభ్యులు ఆమోదం పొందిన బిల్లులపై చర్చించారు చర్చల్లో పాల్గొన్న పార్టీల్లో అన్నాడిఎంకె, ఆమ్ ఆద్మీపార్టీ, బిజెడి, బిజెపి, కాంగ్రెస్, సిపిఐ,సిపిఎం. డిఎంకె, జెడి(యు), టిఆర్‌ఎస్, వైసిపి సహా అన్ని పార్టీలు ఉండడం గమనార్హం.

దాదాపు 87 శాతం మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. పెగాసస్ వివాదం, రైతుల సమస్యలపై చర్చకు పట్టుబడుతున్న తృణమూల్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీల సభ్యుల బలం సభలో మొత్తం సభ్యుల్లో ఆరు శాతంకన్నా తక్కువేనని అధికారులు చెప్తున్నారు. 

గత వారం బిల్లుల ఆమోదంపై సభ దాదాపు 3 గంటల 25 నిమిషాలు ఖర్చు చేయగా, గొడవల కారణంగా నష్టపోయిన సభా సమయం 21గంటల 36 నిముషాలని అధికారులుతెలిపారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి మొత్తం 78 గంటల30 నిమిషాల సభా సమయంలో గొడవల కారణంగా 60 గంటల 28 నిమిషాలు నష్టమైనాయని అధికారులు తెలిపారు.