త్రిపుర సీఎంపై హత్యాయత్నం, ముగ్గురి అరెస్ట్

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌పై హత్యాయత్నం చేశారంటూ ముగ్గుర్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ వీథిలోని తన అధికారిక నివాసం నుంచి గురువారం ఆయన ఈవెనింగ్ వాక్‌కి వెళ్లినపుడు ఈ ముగ్గురూ సీఎం సెక్యూరిటీ వాహనాల్లోకి ఓ కారును నడిపారని పోలీసులు తెలిపారు. 

ఆ కారు వేగంగా దూసుకు రావడాన్ని గమనించిన ముఖ్యమంత్రి ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారని చెప్పారు. ఈ సంఘటనలో భద్రతా సిబ్బందిలోని ఓ అధికారికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. ఆ కారును ఆపేందుకు సీఎం భద్రతా సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు ఓ కిలోమీటర్ ఛేజింగ్ తర్వాత ఆ కారును ఆపగలిగారు. టిఆర్01-0356 నంబరుగల ఈ కారులోని ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. కషరి పట్టి నివాసి శుభం సాహా (27), రామ్ ఠాకూర్ సంఘ నివాసి అమన్ సాహా (25), రవీంద్రపల్లి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న గైరిక్ ఘోష్ (24)గా వీరిని గుర్తించినట్లు చెప్పారు. 

ఈ నిందితులను ప్రశ్నించేందుకు రెండు రోజుల కస్టడీ కోరామని, అయితే వీరిని కోర్టు ఆగస్టు 19 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించిందని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిద్యుత్ సూత్రధర్  తెలిపారు. వీరి చర్యకు కారణాలు ఇంకా వెల్లడి కాలేదన్నారు.