అన్ని సెక్షన్లో రైళ్ల వేగం గంటకు 130 కిమీ కు పెంపు 

అన్ని సెక్షన్లలో వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల వరకు పెంచనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. భారతీయ రైల్వేలో రైళ్ల వేగవంతం చేసేందుకు నిరంతరం కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. వేగవంతమైన సామర్థ్యాన్ని, సంబంధిత విభాగం గరిష్టంగా అనుమతించదగిన వేగాన్ని దృష్టిలో ఉంచుకుని రైళ్లు చార్టు ట్రాక్‌ లభ్యత, అప్‌ గ్రేడేషన్‌, సెక్షన్‌ రెట్టింపు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

రైళ్లను వేగవంతం చేసే ప్రయత్నంలో 2018-19, 2019-20 సమయంలో భారతీయ రైల్వే 140, 70 రైళ్లను వేగవంతం చేసిందని తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు గతేడాది మార్చి నుంచి ప్యాసింజర్లను నిలిపివేసిందని గుర్తు చేశారు. 

ప్రస్తుతం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య సలహాదారుల ఆందోళనలు, సలహాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపిస్తున్నట్లు తెలిపారు. 2020-21 సంవత్సరంలో 488 సర్వీసులను వేగవంతం చేయాలని నిర్ణయించారని చెప్పారు.

ఇండియన్‌ రైల్వే పర్మనెంట్‌ వే మాన్యువల్‌ (ఐఆర్‌పీడబ్ల్యూఎం)లో పేర్కొన్న ప్రమాణాల ఆధారంగా ట్రాక్‌ రెన్యువల్‌ పెండింగ్‌లో ఉన్నాయని, రెగ్యులర్‌ ట్రాక్‌ రెన్యువల్‌ పనుల ద్వారా ట్రాక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అప్‌గ్రేడేషన్‌ చేయనున్నట్లు తెలిపారు.  2020-21 మధ్య 4,363 కిలోమీటర్ల (పూర్తి ట్రాక్‌ పునరుద్ధరణ యూనిట్లలో) ట్రాక్‌ పునరుద్ధరణ జరిగిందని, ప్రస్తుత 2021-22 సంవత్సరంలో 751 కిలోమీటర్ల (పూర్తి ట్రాక్‌ పునరుద్ధరణ యూనిట్లలో) ట్రాక్‌ పునరుద్ధరణ చేపట్టినట్లు తెలిపారు.