మోదీ సాయంతోనే ఒలింపిక్స్ మెడల్ సాధించిన చాను 

టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజతం గెలుపొంది భారత్ కు మొదటి పథకం అందించిన మీరాబాయి చాను విజయం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ సకాలంలో వైద్య సహాయం అందించడం ఉన్నట్లు ఇప్పుడు వెల్లడైనది. 
 
ఆమెకు వైద్యం కోసం అమెరికా వెళ్ళడానికి  ప్రధాని నరేంద్రమోదీ సహాయం చేశారని మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్  వెల్లడించారు. ఆమెకు కండరాల ఆపరేషన్ కోసం యూఎస్ వెళ్లడానికి సహకరించారని, అలా చేయకపోయి ఉంటే ఆమె ఒలింపిక్స్ఈ లో పాల్గొని ఈ రోజు దేశానికి ఈ పతకం వచ్చేది కాదని బిరేన్ సింగ్ పేర్కొన్నారు. 
 
మీరాభాయి చాను తన ఆరోగ్య సమస్యలను ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో ముఖ్యమంత్రి బీరెన్‌కు తెలియజేసింది. ఆ విషయం ప్రధాని కార్యాలయానికి తెలియడంతో ఆమెకు అమెరికాలో మెరుగైన వైద్యం, శిక్షణ అందించేందుకు సహాయపడ్డారని తెలిసి ఆశ్యర్యపోయానని ముఖ్యమంత్రి బీరేన్ తెలిపారు.
 
సాక్షాత్తు ప్రధానే ఆమెకు సహాయం చేశారని తెలుసుకుని మణిపూర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని బీరేన్ తెలిపారు. ఈ వారం తాను ఢిల్లీలో మోదీని కలిసినపుడు కృతజ్ఞతలు చెప్పానని అన్నారు. ఇంకొక అథ్లెట్‌కు కూడా ప్రధాని సహాయం చేశారని, అది ఆయన గొప్పతనం అని బీరేన్ పేర్కొన్నారు. 
 
వెయిట్‌ లిఫ్టింగ్‌లో 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి  ఆమె రికార్డు నెలకొల్పింది. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్‌ ఎత్తి పతకం మీద ఆశలు పెంచింది. మొత్తంమీద 202 కేజీలు ఎత్తిన చాను.. స్వర్ణ పతకం కోసం జరిగిన మూడవ అటెంప్ట్‌లో విఫలమైంది. దాంతో రెండవ స్థానంలో నిలవడంతో రజత పతకం సొంత చేసుకుంది.  21 ఏళ్ల తరువాత భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్‌ మెడల్ లభించింది.