కేంద్రం పరిశీలనలో జమిలి ఎన్నికలు

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో అన్ని ఎన్నికలనూ ఏకకాలంలో నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసిందని, అలాగే ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ సిఫార్సులు చేసిందని, ఇవన్నీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 
 
లోక్‌సభలో ప్రదీప్ కుమార్ సింగ్ అనే సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎన్నికలు తరచూ జరగడం వల్ల సాధారణ ప్రజా జీవితం ఇబ్బందులకు గురవడంతోపాటు వారికి అందే అత్యవసర సేవల పైనా ప్రభావం పడుతోందని చెప్పారు. 
 
అన్ని ఎన్నికలూ ఏక కాలంలో జరిపితే ఏటేటా వాటి నిర్వహణ వ్యయభారం తగ్గిపోతుందని న్యాయ వ్యవ హారాల పార్లమెంటరీ స్థాయి సంఘం తన 79 వ నివేదికలో పేర్కొందని తెలిపారు. ఎన్నికల సంఘంతో సహా వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించి తగు సిఫార్సులు చేసింది. 
 
అవన్నీ పరిశీలించి జమిలి ఎన్నికలపై ఆచరణాత్మక మార్గసూచిక, నిబంధనలు రూపొందించాలని సూచిస్తూ లా కమిషన్‌కు పంపారు. విభిన్న వర్గాలతో సంప్రదించిన తరువాత ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ 244, 255 నివేదికల్లో సిఫార్సులు చేసిందని మంత్రి చెప్పారు.
2014-19 మధ్య కాలంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,814 కోట్ల నిధులను విడుదల చేసిందని వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు జరిగే జమిలీ ఎన్నికలతో ఆ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని పేర్కొన్నారు.