నీర‌జ్‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని అభినంద‌న‌లు

నీర‌జ్‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని అభినంద‌న‌లు

టోక్యా ఒలంపిక్స్‌లో అసమాన ప్రతిభ కనబరిచి.. జావెలిన్ త్రో‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు దేశవ్యాప్తంగా అభినందలు వెల్లువెత్తుతున్నాయి. 121 ఏళ్ల భారత చరిత్రలో అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా రికార్డులకు ఎక్కడంతో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు కురిపించాయి. 

టోక్యోలో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించడం దేశానికి గర్వకారణమని, దేశ ప్రజల హృదయాల్లో ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. నీరజ్ చోప్రా సాధించిన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఇది అసాధారణ విజయమని, చోప్రా సాధించిన జావెలిన్ గోల్డ్ అన్ని హద్దులను చెరిపేసి, చరిత్ర సృష్టించిందని, దేశం గర్విస్తోందని అభినందించారు.

టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చి బంగారు ప‌త‌కం నెగ్గిన నీర‌జ్ చోప్రాపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ రోజు టోక్యోలో చ‌రిత్ర లిఖించ‌బ‌డింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

నీర‌జ్ చోప్రా సాధించిన ఘ‌న‌త దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఎప్ప‌టికీ చెరిగిపోని ముద్ర వేసింద‌ని కొనియాడారు. ఫైన‌ల్‌లో నీర‌జ్ ప్ర‌ద‌ర్శ‌న ఆమోఘ‌ని ప్ర‌ధాని మెచ్చుకున్నారు. ఇవాళ నీర‌జ్ చోప్రా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తోపాటు అస‌మాన ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శించాడ‌ని పొగిడారు. టోక్యోలో మువ్వ‌న్నెల జెండాను రెప‌రెప‌లాడించిన నీర‌జ్‌కు మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు చెబుతున్నాన‌ని ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు

”యావద్భారతావని గర్వించదగిన మధురమైన క్షణం! టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభతో భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించిన శ్రీ నీరజ్ ఛోప్రాకు హార్దిక అభినందనలు. స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో తొలి స్వర్ణం తీసుకొచ్చిన నీరజ్ ఛోప్రా భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

కాగా, ఒలంపిక్స్ జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు కేంద్ర యవజనల వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అభినందనలు తెలిపారు. నీరజ్ చరిత్ర సృష్టించారని, ఒలంపిక్స్‌లో జరిగిన ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారని అన్నారు. భవిష్యత్ తరాలకు నీరజ్ చోప్రా స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.

‘పయ్యాలీ ఎక్స్‌ప్రెస్‌’గా పిలిచే పిటి ఉషా 1984లో లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 హరల్డ్స్‌లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్నారు. ఇప్పుడు నీరజ్‌ గెలుపును తన గెలుపుగా భావించి, ఈ ఆనందంలో పాలు పంచుకున్నారు. ‘నా 37 ఏళ్ల కళ, ఇన్నాళ్లకు తీరింది… థ్యాంక్యూ మై సన్‌ నీరజ్‌ చోప్రా’ అంటూ నీరజ్‌తో దిగిన ఫోటోను ట్వీట్‌ చేశారు.