`జంతర్ మందిర్ వద్ద కాల్పులు’ ఆరోపణలను కొట్టిపారేసిన నడ్డా

`జంతర్ మందిర్ వద్ద కాల్పులు’ ఆరోపణలను కొట్టిపారేసిన నడ్డా
 
* పదేపదే మాట మారుస్తూ సభనుండి పారిపోతున్న రాహుల్!

సిపిజే నిరసనల సమయంలో కాల్పులు జరిపినట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి జె.పి. నడ్డా తిప్పికొట్టారు. ‘జంతర్ మంతర్ వద్ద ఎలాంటి కాల్పులూ జరగలేదని’ స్పష్టం చేసిన ఆయన, అటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ నేత ‘ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని’ విమర్శించారు.

నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరపడానికి ఎవరు అనుమతి ఇచ్చారంటూ రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించిన నేపథ్యంలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత తన డిమాండ్లను తరచుగా మారుస్తూ పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని, సభ సజావుగా సాగకుండా చూడటమే ఆయన లక్ష్యమని నడ్డా ఆరోపించారు.

మొదట నీట్ అంశంపై చర్చ జరగాలని రాహుల్ గాంధీ కోరారని, ప్రభుత్వం దానికి అంగీకరించిన తర్వాత తన డిమాండ్‌ను మార్చుకుని, ఆపై రామమందిర ట్రస్ట్, జంతర్ మంతర్ ఘటనల గురించి ప్రస్తావించారని ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ పార్లమెంటులోనూ, చర్చాంశాలలోనూ ప్రతిరోజూ తన వైఖరిని మారుస్తూ ఉంటారు. చర్చలో పాల్గొనడం ఆయన ఉద్దేశ్యం కాదు, గందరగోళం సృష్టించడమే ఆయన లక్ష్యం’ మండిపడ్డారు. 

 “సమావేశాల ప్రారంభంలో ఆయన నీట్ అంశంపై చర్చ కోరారు. మేము దానికి అంగీకరించినప్పుడు, ఆయన రామమందిర ట్రస్ట్ అంశాన్ని లేవనెత్తారు; ఆ తర్వాత జంతర్ మంతర్ ఘటనపై హోం మంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టారు. సభ పని చేయకుండా అడ్డుకోవడమే ఆయన ఉద్దేశ్యం” అంటూ ధ్వజమెత్తారు.  ఆయన సభ జరగాలని కోరుకోవడం లేదని, అందుకే గత 15 రోజులుగా సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని నడ్డా విమర్శించారు. 

జంతర్ మంతర్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించినప్పుడు, అక్కడ కాల్పులు జరిగాయని చెప్పి రాహుల్ గాంధీ ప్రజలను ‘తప్పుదోవ పట్టించడం’ మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు. “ఈ రోజు జంతర్ మంతర్ అంశంపై చర్చించాలని నిర్ణయించినప్పుడు, వాస్తవానికి అక్కడ ఎలాంటి కాల్పులూ జరగనప్పటికీ, జంతర్ మంతర్ వద్ద కాల్పులు జరిగాయని చెప్పి ఆయన ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టించడం ప్రారంభించారు” అని ఆయన పేర్కొన్నారు.

పార్లమెంటులో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి హోం మంత్రి సిద్ధంగా ఉన్నారని నడ్డా చెప్పారు. ప్రభుత్వం వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందని, సభ సజావుగా సాగాలన్నదే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. “సభ జరిగితే, ప్రతి అంశంపై సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని ఆయన స్పష్టం చేశారు.