రైతు ఉద్యమంలో చీలిక.. గుర్నామ్‌సింగ్‌ సస్పెండ్‌

గత  తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్న రైతు నేతల్లో చీలిక వచ్చింది. ఇప్పటివరకు యునైటెడ్‌ కిసాన్‌ మోర్చా (యూకేఎం) లో క్రియాశీలకంగా ఉన్న యోగేంద్ర యాదవ్‌, రాకేశ్‌ తికాయత్‌, గుర్నామ్‌సింగ్‌ చాదుని మధ్య విభేదాలు పొడసూపాయి. ఉద్యమ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు గుర్నామ్‌ సింగ్‌ చాదునిపై యూకేఎం చర్యలు తీసుకున్నది. 

ఆయనపై 15 రోజుల స్పస్పెన్షన్‌ వేటు వేయడంతో యూకేఎం సమావేశాలను హాజరుకాకూడదని గుర్నామ్‌సింగ్ నిర్ణయించుకున్నారు. గుర్నామ్‌సింగ్‌ ప్రస్తుతం భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) హర్యానా శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. తమ సంఘం పట్ల యూకేఎంలో ఉన్న పంజాబ్‌ రైతు సంఘాలు సవతి ప్రేమను ప్రదర్శిస్తున్నారని యోగేంద్ర యాదవ్‌, రాకేశ్‌ తికాయత్‌పై గుర్నామ్‌సింగ్‌ చాదుని ఆరోపిస్తున్నారు.

గుర్నామ్‌సింగ్‌ పంజాబ్‌లో యాక్టీవ్‌గా ఉన్నారు. త్వరలో జరుగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు పోటీ చేయాలని గుర్నామ్‌సింగ్‌ పిలుపునివ్వడం యునైటెడ్‌ కిసాన్‌ మోర్చా నేతలకు నచ్చలేదు. దాంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు. గుర్నామ్‌సింగ్‌తోపాటు మరో ఐదుగురు రైతు సంఘాల నాయకులను కూడా సస్పెండ్‌ చేశారు.

ఫలితంగా ఇకముందు యూకేఎం సమావేశాలకు వెళ్లకూడదని, స్వతంత్రంగా ఉద్యమాన్ని నడుపాలని గుర్నామ్‌సింగ్‌ నిర్ణయానికొచ్చారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేసిన యోగేంద్ర యాదవ్‌పై, రైతు పార్లమెంట్‌లో బీజేపీ నేతను స్పీకర్‌గా పెట్టిన రాకేశ్‌ తికాయత్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో స్పష్టం చేయాలని గుర్నామ్‌సింగ్‌ డిమాండ్‌ చేస్తున్నారు.