కేబినెట్‌ హోదా తిరస్కరించిన యెడియూరప్ప

కర్ణాటక మాజీ మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పకు కేబినెట్‌ హోదా తరహా సౌకర్యాలు కొనసాగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్‌ మంత్రి మాదిరిగా జీతభత్యాలు, ప్రభుత్వ వాహనం, అధికార నివాసం వంటి సౌకర్యాలు మాజీ సీఎం యెడియూరప్పకు కొనసాగుతాయని ప్రకటించింది. 

ఆ మేరకు కర్ణాటక ప్రభుత్వ సిబ్బంది, పరిపాలనా సంస్కరణల విభాగం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఆ పదవిలో ఉన్నంత వరకు యెడియూరప్పకు కేబినెట్‌ హోదా సౌకర్యాలు అందుతాయని ఆ ఉత్తరువులలో పేర్కొన్నారు. 

అయితే, యెడియూరప్ప ఈ సదుపాయాలను సున్నితంగా  తిరస్కరించారు. మాజీ ముఖ్యమంత్రులకు కల్పించే సౌకర్యాలు మాత్రమే తాను వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. ఆ ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ సీఎం బసవరాజ్ బొమ్మైకు ఆదివారం లేఖ రాశారు. 

ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవీ బాధ్యతలు చేపట్టి, రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసిన జులై 26న ఆయన తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన ప్రస్తుతం షికారిపుర ఎమ్మెల్యేగా తప్ప ఎలాంటి పదవుల్లో లేరు.

ముఖ్యమంత్రి అధికార నివాసం `కావేరి’ లో నివాసం కొనసాగేటట్లు చేయడం కోసమే ఆయనకు  కాబినెట్  హోదా కల్పిస్తూ ప్రత్యేకంగా జిఓ జారీచేసిన్నట్లు ప్రతిపక్షాలు విమర్శించాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సహితం ముఖ్యమంతిగా ఉన్న సమయంలో `కావేరి’లోనే నివాసం ఉన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన సొంత ఇంటిలోనే ఉంటానని, ప్రభుత్వ భవనంలోకి మారనని ఇప్పటికే ప్రకటించారు.