బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రాకు భారీ నజరానా

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా(23)కు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఈటెను 87.58 మీటర్లు విసిరిన ఈ అథ్లెటర్‌ను ప్రశంసిస్తూ రూ.6 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖతార్‌ శనివారం ట్వీట్‌ చేశారు. 
 
ఈ క్షణాల కోసమే యావత్‌ భారతావని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తోందని, దేశమంతా నీరజ్‌ విజయం పట్ల గర్వంగా ఉందని ట్విటర్‌లో తెలిపారు. కాగా, హర్యానా నుండి టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన క్రీడాకారులందరికీ రూ.10 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు సిఎం శుక్రవారమే ప్రకటించారు. 

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథెట్లు, క్రీడాకారులకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) నగదు బహుమతిని ప్రకటించింది. బంగారు పతకం విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, వెండి పతకం విజేతలు మీరాబాయి చాను, రవి కుమార్ దహియాకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, కాంస్య పతకం విజేతలు పీవీ సింధూ, లోవ్లినా బోర్గోహైన్, బజరంగ్ పునియాకు రూ. 25 లక్షలు చొప్పున, హాకీ పురుషుల బృందానికి రూ.1.25 కోట్ల నగదును ఇవ్వనున్నట్లు తెలిపింది.

మరోవైపు నీరజ్‌ చోప్రాకు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రూ. 2 కోట్ల ప్రత్యేక నగదు బహుమతిని ప్రకటించారు. నీరజ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడిన ఆయన, ఒలింపిక్స్‌లో దేశానికి తొలి బంగారు పతకం సాధించి భారత్‌ గర్వించేలా చేశారని కొనియాడారు.

బ‌డ్జెట్ కారియ‌ర్ ఇండిగో ఎయిర్‌లైన్స్  నీర‌జ్ చోప్రాకు ఏడాది పాటు అప‌రిమితంగా ప్ర‌యాణ టిక్కెట్లు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.  ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు ఏడో తేదీ వ‌ర‌కు అప‌రిమితంగా విమాన ప్ర‌యాణ టిక్కెట్లు ఉచితంగా అంద‌జేస్తామ‌ని పేర్కొంది. మణిపూర్ ప్రభుత్వం కూడా నీరజ్‌ చోప్రాకు రూ.కోటి రివార్డును ప్రకటించింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ట్వీట్‌ చేశారు.