ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఇ- కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమ వ్యాపార విధానాలపై సీసీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ ఈ కంపెనీలు వేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నాలుగువారాల్లోగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌ సంస్థలు మార్కెట్‌ పోటీతత్వ చట్టాలను ఉల్లంఘిస్తూ కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని, భారత్‌లోని పలు వ్యాపార సంస్థలు చేసిన ఆరోపణలను కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పరిగణనలోకి తీసుకుంది.

గతేడాది జనవరిలో ఈ సంస్థలపై సీసీఐ విచారణకు ఆదేశించగా ఈ కంపెనీలు ఆ ఆరోపణలను కొట్టిపారేశాయి. సీసీఐ రుజువులు లేకుండా దర్యాప్తు చేపట్టిందని ఆరోపిస్తూఈ రెండు సంస్థలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. 

కర్ణాటక హైకోర్టు కూడా జూలై 23న ఈ కంపెనీల వ్యాపార విధానాలపై కచ్చితంగా విచారణ జరపాల్సిందేనని తేల్చి చెప్పింది. మరలా ఈ రెండు కంపెనీలు కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయతే సుప్రీం ధర్మాసనంలో కూడా వీటికి నిరాశే ఎదురైంది.

‘అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి పెద్ద సంస్థలు స్వచ్ఛందంగా విచారణలకు ముందుకు రావాలి. కానీ మీరే దర్యాప్తే జరగకూడదని అనుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో విచారణ జరగాలి. మీరు నివేదికలు సమర్పించాలి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.