మధ్యవర్తిత్వంతో జలవివాదాలు పరిష్కరించుకోండి

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న జలవివాదాలను  మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ హితవు చెప్పారు. అవసరమైతే ఇందుకు సుప్రీంకోర్టు కూడా సహకరిస్తుందని తెలిపారు. ఇటీవల కృష్ణా ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుదుత్పత్తి చేస్తోందని, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తెలంగాణ ప్రభుత్వ అసంబద్ధ, అన్యాయమైన చర్యలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కులకు భంగం కలుగుతోందని, చట్టబద్ధంగా దక్కాల్సిన జలాలు దూరమవుతున్నాయని పేర్కొంది. ఈ వ్యాజ్యం సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది.

విచారణ ప్రారంభం కాగానే సీజేఐ జోక్యం చేసుకుంటూ ‘ఈ అంశంలో నేను న్యాయపరమైన అంశాల జోలికి వెళ్లదలుచుకోలేదు. నేను రెండు రా ష్ర్టాలకు (ఏపీ, తెలంగాణ) చెందినవాడిని. ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే అవకాశం ఉంటే తప్పకుండా ఆ పని చేయండి. అందుకు మేం సాయం చే స్తాం. తప్పనిసరిగా పిటిషన్‌ను విచారించాలని కోరితే దీనిని వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తామ’ని పేర్కొన్నారు.

దీనిపై రెండు రాష్ట్రాల తరఫు న్యాయవాదులు ప్రభుత్వాలను ఒప్పించి, సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని ఆకాంక్షించారు. దీనిపై ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే స్పందిస్తూ… ఇది రాజకీయపరమైన అంశమని, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. ఇందుకు కొంత సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేస్తామని చెప్పగా… అందుకు తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ కూడా అంగీకరించారు.

బోర్డు పరిధిని నిర్ణయిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసినందున ఎపి పిటిషన్‌పై విచారణ అవసరం లేదని తెలంగాణ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్టోబర్‌ నుంచి గెజిట్‌ అమల్లోకి వస్తుందని.. ఈలోపు నీటిని తెలంగాణ వాడుకునే అవకాశం ఉన్నందున తక్షణం గెజిట్‌ అమలు చేయాలని ఎపి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.