అస్సాం సీఎంపై కేసు నమోదుపై మిజోరాం వెనుకడుగు 

అస్సాం, మిజోరాం రాష్ట్రాల సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశర్మ, మరో కొందరు అస్సాం ఉన్నత పోలీస్ అధికారులపై మిజోరాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించడానికి మిజోరాం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
సరిహద్దు వివాదం విషయమై అవసరమైతే సుప్రీం కోర్ట్ కు వెడతామని శర్మ ప్రకటించగా, కేసును పునపరిశీలిస్తున్నట్లు మిజోరాం ప్రభుత్వం ప్రకటించింది. తనపై కేసు నమోదు చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం పరిష్కారం అవుతుందని భావిస్తే తాను ఏ పోలీస్ స్టేషన్ కైనా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు శర్మ ప్రకటించారు.
అయితే తమ రాష్ట్ర పోలీస్ అధికారులపై కేసు నమోదు చేయడాన్ని మాత్రం ఆమోదించబోనని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఇటువంటి ఘర్షణ జరిగి ఉండవలసింది కాదని అంటూ ఏ సమస్యనైనా చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోగలమని హితవు చెప్పారు. ఘర్షణలు మార్గం కాదని తెలిపారు. అయితే అసోం సీఎం హిమాంత బిశ్వ‌శ‌ర్మ‌కు వ్య‌తిరేకంగా మిజోరంలో ఎఫ్ఐఆర్‌ న‌మోదైన విష‌యం మిజోరం ముఖ్య‌మంత్రి జొరామ్‌తంగ‌కు గానీ, త‌న‌కుగానీ తెలియ‌ద‌ని స్పష్టం చేస్తూ  మిజోరం రాష్ట్ర చీఫ్ సెక్రెట‌రీ లాల్‌నున్‌మావియా చువాంగో ఒక ప్రకటన చేశారు.
ఈ కేసు విష‌యాన్ని సీఎం జొరామ్‌తంగ దృష్టికి తీసుకెళ్ల‌గా ఆయ‌న పునఃప‌రిశీలిద్దామ‌ని చెప్పిన‌ట్లు తెలిపారు. స‌రిహ‌ద్దుల్లో ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించి మిజోరం పోలీసులు త‌న‌పైన‌, త‌న ప్ర‌భుత్వంలోని న‌లుగురు ఉన్న‌తాధికారుల‌పైన ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డాన్ని అసోం ముఖ్య‌మంత్రి హిమాంత బిశ్వ‌శ‌ర్మ  త‌ప్పుప‌ట్టారు.
ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని స‌జీవంగా ఉంచ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న స్పష్టం చేశారు.  మిజోరం సీఎం జొరామ్‌తంగ క్వారెంటైన్ ముగిసిన త‌ర్వాత త‌న‌తో ఫోన్‌లో మాట్లాడుతాన‌ని చెప్పార‌ని తెలిపారు. జులై 26న అసోం, మిజోరం స‌రిహ‌ద్దుల్లో ఆ రెండు రాష్ట్రాల పోలీసుల బ‌ల‌గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు మృతిచెందారు. ఎస్పీ స‌హా మ‌రో 50 మంది గాయ‌ప‌డ్డారు.

 మిజోరం వైపు కూడా ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించి జూలై 30న మిజోరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.  అసోం ముఖ్య‌మంత్రి హిమాంత బిశ్వ‌శ‌ర్మ‌, మ‌రో న‌లుగురు సీనియ‌ర్ అధికారులను అందులో నిందితులుగా చేర్చారు. హ‌త్యాయ‌త్నం, నేర‌పూరిత కుట్ర త‌దిత‌ర సెక్ష‌న్‌ల కింది వారిపై కేసులు న‌మోదు చేశారు.

బీజేపీలో మణిపూర్ మాజీ పీసీసీ చీఫ్

ఇలా ఉండగా, మణిపూర్ మాజీ పీసీసీ చీఫ్ గోవింద్ దాస్ ఆదివారం బీజేపీలో చేరారు. సీఎం బిరేన్ సింగ్‌తో పాటు జాతీయ నేతల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో చీఫ్ విప్‌గా కూడా కొనసాగారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంతంపై అధిక శ్రద్ధ వహిస్తున్నారని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.  ఈశాన్య ప్రాంతానికి చెందిన ఐదుగురిని తాజాగా కేబినెట్‌లోకి తీసుకోవడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, ఈ విషయంపై తాము కొన్ని రోజుల క్రిందటే ప్రకటన చేశామని గుర్తు చేశారు. 
 
గతంలో మణిపూర్‌లో నిత్యం ఉద్యమాలు జరుగుతూ ఉండేవని, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే మణిపూర్ శాంతియుతంగా మారిందని పేర్కొన్నారు. ‘‘నేను కూడా కాంగ్రెస్‌లో పనిచేశా. కానీ… డ్రైవర్ నిద్రపోతే… బండిని ఎవరు నడుపుతారు… బండి ఎలా ముందుకు కదులుతుంది?’’ అంటూ సీఎం బిరేన్ సింగ్ పరోక్షంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.