80 శాతం ట్రిపుల్ తలాక్ కేసులు తగ్గాయి

ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం అమలుతో అప్పటికప్పుడు ట్రిపుల్ తలాక్ చెప్పే కేసులు 80 శాతం తగ్గినట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి తెలిపారు. ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా ముస్లిం మహిళలు స్వాగతిస్తున్నారని చెప్పారు. 

 ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలో నఖ్వి మాట్లాడుతూ ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని, సాధికారికతను, ఆత్మ విశ్వాసాన్ని తమ ప్రభుత్వం గణనీయంగా బలోపేతం చేసినదని చెప్పారు. ఈ రోజును ప్రభుత్వం ముస్లిం మహిళల హక్కుల దినంగా పాటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు అమలు జరుపుతున్నట్లు వివరించారు. 

ఈ చట్టం దేశంలోని ముస్లిం మహిళల అందరి రాజ్యాంగ, ప్రాధమిక, ప్రజాస్వామ్య హక్కులను  కాపాడేందుకు ఎంతగానే తోడ్పడుతున్నదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ చట్టం ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తుందని, ఈ సామాజిక దురాచారాన్ని ఆచరించే భర్తకు మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించడానికి అవకాశం కల్పిస్తుందని ఆయన వివరించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని  గుర్తు చేస్తూ 2019లో రెండో సారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ చట్టాన్ని ఆగష్టు 1 నుండి అమలులోకి తెచ్చారని పేర్కొన్నారు. ‘అయోధ్యలో రామాలయ అంశం పరిష్కారమైంది. జమ్మూకశ్మీర్ ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా 370వ అధికరణను రద్దు చేశారు. మహ్రం లేకుండా 3,5000 మంది ముస్లిం మహిళలు హజ్ యాత్ర చేశారు” అని నఖ్వి తెలిపారు. 

“మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందుకనే ఇటువంటి పలు చారిత్రాత్మకమైన పరిణామాలు దేశములు జరుగుతున్నాయి’ అని తెలిపారు. 

2019 ఆగస్టు 1న ముస్లిం మహిళా పరిరక్షణ చట్టం చేసినప్పటి నుంచి ఇన్‌స్టంట్ తలాక్ కేసులు 80 శాతం వరకూ తగ్గాయని చెప్పారు. ఈ చట్టం తేవడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లో 63,000కు పైగా కేసులు నమోదు కాగా, చట్టం తెచ్చిన తర్వాత ఆ తరహా కేసులో 221కు తగ్గిపోయాయని తెలిపారు. బీహార్‌లో 49 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు.

ఇటువంటి బిల్లు కోసం ఎంతో పట్టుదలతో ఎన్నో పోరాటాలు చేసిన అనేకమంది మహిళలకు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ జైజైలు పలికారు. వారందరి అభిలాషను మోదీ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకు వచ్చినదని చెప్పారు. ముస్లిం మహిళల సాధికారికతకు, వారి హక్కుల పరిరక్షణకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ఆమె.

మరో కేంద్ర మంత్రి  భూపిందర్ యాదవ్ మాట్లాడుతూ ఈ సమాజం కూడా మహిళల పురోగతి లేకుండా అభివృద్ధి చెందలేదని స్పష్టం చేశారు. మహిళలకు న్యాయం జరిగేటట్లు చేయడం ప్రతి ప్రభుత్వం కర్తవ్యమని స్పష్టం చేస్తూ అందుకనే మోదీ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక చట్టం తీసుకు వచ్చినదని చెప్పారు.