కేరళలో రామాయణంను ఆశ్రయిస్తున్న వామపక్షాలు 

సంత్ కబీర్ దాస్- రమై రామవై జోయి, తకార్ నామ్ రామ్ హోయి వంటి ద్విపద ఉంది. ఈ రోజుల్లో శ్రీ రాముడు రాజకీయాల్లో కొత్త అవకాశాలకు చిహ్నంగా మారుతున్నాడు. మర్యాద పురుషోత్తముడు  దాదాపు ప్రతి పార్టీ ఎజెండాలో చేరుతున్నారు. 
 
కేరళలో తాము కోల్పోతున్న సైద్ధాంతిక భూమికను పూడ్చుకోవడం కోసం ఇప్పుడు వామపక్షాలు సహితం శ్రీరాముడిని ఆశ్రయిస్తున్నాయి. తాజాగా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) దృష్టి  రామాయణం వైపు మళ్లింది. మూడేళ్ళ క్రితం వామపక్ష కూటమికి నేతృత్వం వహిస్తున్న సిపిఎం సహితం నెలరోజులపాటు రామాయణ మాసం అంటూ కార్యక్రమాలు జరిపింది.  
 
దేశంలో పెరుగుతున్న ఆర్ ఎస్ ఎస్ సైదంతిక ప్రాతిపదిక ప్రాబల్యంను అడ్డుకోవడం కోసమే తాము రామాయణంను ఆశ్రయిస్తున్నట్లు వామపక్ష నేతలు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. హిందుత్వ కు వారు మాత్రమే ప్రతినిధులు కారని, కమ్యూనిజం మూల సిద్దంతాలకు భూమిక సహితం అందులో ఉన్నదని అంటూ సరికొత్త వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దేవుడిపై నమ్మకం లేని పార్టీలు సహితం హిందూ దేవాలయాలు, హిందూ దేవతలను ఆశ్రయించడం చూసాము. తమిళనాడులో డీఎంకే ప్రత్యేకంగా `హిందూ దేవాలయాల పరిరక్షణ’ కోసం అంటూ ఒక పత్రం విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ తో పాటు, పలువురు నేతలు దేవాలయాల చుట్టూ ప్రదక్షణలు చేశారు.
 
ఇక పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ప్రత్యేకంగా దుర్గా పూజలు జరిపి, తాను బ్రాహ్మణా కులస్థురాలిని అంటూ చాటుకొని హిందువులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శనతో ఇటువంటి ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మక పోవడం వేరే విషయం.
కేరళలో మొదటి ముస్లిం జిల్లాను ఏర్పాటు చేసి తమ `లౌకిసవాదాన్ని’ 50వ దశకంలోనే చాటుకున్న సిపిఐ ఇప్పుడు అదే మల్లాపురం జిల్లాలో హిందువులను ఆకర్షించడం కోసం రామాయణంపై ఆన్ లైన్ లో ప్రసంగాలు నిర్వహించింది. సిపిఐ జిల్లా కమిటీ పేస్ బుక్ పేజీలో “రామాయణం – భారత వారసత్వం” పేరుతో వారం రోజుల పాటు సాగిన ఈ ప్రసంగాలు జులై 25న ప్రారంభం అయ్యాయి.
రాష్ట్ర స్థాయి సిపిఐ నాయకులు ఈ ప్రసంగాలు చేశారు. రామాయణం విశ్వజనీన సందేశం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్న సిపిఐ సీనియర్ నేతలు దాని సారాంశం కమ్యూనిజం మూల సూత్రాలే అన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
 
“ప్రస్తుతం మతతత్వ, ఫాసిస్ట్ శక్తులు హిందుత్వంకు సంబంధించిన అన్ని అంశాలకు తామే ప్రతినిధులమని చెప్పుకొంటున్నారు. మిగిలిన వారంతా దూరంగా జరుగుతున్నారు. కానీ రామాయణం వంటి పురాణాలు భారత దేశసమిష్టి సంస్కృతి, వారసత్త్వములలో భాగం” అని సిపిఐ జిల్లా కార్యదర్శి కె కృష్ణదాస్ ఈ ఆన్ లైన్ ప్రసంగాలను సమర్ధించుకున్నారు. 
 
“రామాయణ కాలంలో ప్రజలు, ఇతర దేశాలతో సంబంధాలు” అనే  అంశంపై సిపిఐ నేత మాజీమంత్రి ముళ్లకర రత్నాకరన్ ప్రసంగిస్తే, “రామాయణంలో సమకాలీన రాజకీయాలు” అనే అంశంపై మరో సిపిఐ నేత ఎం కేశవన్ నాయర్, “అనేక రామాయణాలు” అంశంపై కవి ఆలంకొండే లీలాకృష్ణన్ ప్రసంగించారు. 
 
రామాయణంలో శ్రీరాముడుని పరస్పర విరుద్ధ శక్తుల సంగమంగా చూపారని, కమ్యూనిస్ట్ లకు ఈ కావ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే వారి మనసుకు మొదటగా గుర్తుకు వచ్చెడిది కార్ల్ మర్క్స్ ప్రబోధించిన గతితార్కిక భౌతికవాదం అంటూ కేశవన్ నాయర్ రామాయణంను మార్కిస్టు తత్వ భూమికగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.  
 
సరిగ్గా మూడేళ్ళ క్రితం, కేరళలో సిపిఎం ఆధ్వర్యంలో ఏర్పడిన కేరళ సంస్కృత సంఘం రామాయణంలోని వివిధ కధనాల గురించి అవగాహన కల్పించడానికి ఒక మిషన్‌ను ప్రారంభించింది. జులై 15, 2018లో ప్రారంభించి నెల రోజుల పాటు రాష్ట్రంలోని 14 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో రామాయణంపై ఆలోచనలు పేరుతో సెమినార్లు నిర్వహించారు.
సంస్కృత సంఘం రాష్ట్ర కన్వీనర్ తిలకరాజ్ రిటైర్డ్ సంస్కృత ఉపాధ్యాయుడు, సిపిఎం ఉపాధ్యాయ విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి. దీని కార్యనిర్వాహక సభ్యుడైన డా వి సదాశివం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాగా, పార్టీ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు. 
2015 నుండి కేరళలో సిపిఎం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ ఉత్సవాలను కూడా నిర్వహించడం ప్రారంభించింది. తమ పార్టీ సభ్యులు ఆర్ ఎస్ ఎస్ నిర్వహించే ఉత్సవాలకు హాజరు కాకుండా నిరోధించడం కోసం ఈ విధంగా చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పుకున్నారు.