మన్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా `శ్వేతవర్ణం’ స్థూపాలు!

అమరవీరుల వారోత్సవాల్లో అరుణ వర్ణ స్థూపాలకు బదులు మన్యంలో శ్వేతవర్ణంలో శాంతిస్థూపాలు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల్లోనే వారికి వ్యతిరేకంగా గళం వినిపించడం, స్థూపాలు నిర్మించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గ్ గా మారింది.

అమరవీరుల వారోత్సవాల్లో మావోయిస్టులు ప్రకటనలు చేయడం, పోస్టర్లు వేయడం సర్వసాధారణం. కానీ ఈ సారి వారోత్సవాల్లో మావోయిస్టులు స్తబ్దుగా కనిపించారు. దీనికి తోడు మావోయిస్టుల వ్యతిరేకంగా విశాఖ మన్యంలో శాంతి స్థూపాలు వెలిశాయి.

జి మాడుగుల మండలం మద్దిగరువు, పెదబయలు మండలం బొంగరం, ముంచంగిపుట్టు మండలం కుమడ ప్రాంతాల్లో ఈ శాంతి స్థూపాలు దర్శనమిచ్చాయి. ప్రధానంగా గిరిజనాభివృద్ధి కోసం మావోయిస్టులను ఎదరించి వారి చేతిలో హతమైన గిరిజన సోదరులకు జోహార్లు అంటూ ఆ స్థూపాలపై నినాదాలు రాశారు.

తెలుపు వర్ణంలో ఈ స్థూపాలు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లోనే దర్శనమివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. శాంతి స్థూపాలను ఏర్పాటు చేసి దానిపై మావోయిస్టు వ్యతిరేక నినాదాలతో పాటు మావోయిస్టుల చేతిలో హతమైన గిరిజనుల పేర్లను రాశారు.

గిరిజనులు సింద్రి కార్ల, కొందుమూరు రామ్మోహన్, కిల్లో రాంబాబు, గొంపలోవ శ్రీను, వంతల సత్యారావు, బచ్చల బాలకృష్ణ, పాంగి సత్తిబాబు, గెమ్మెలి భాస్కరరావు, గెమ్మెలి సంజీవరావులతో పాటు మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ బ్లాస్ట్‌లో మృతిచెందిన అజయ్‌కుమార్, మోహనరావుల పేర్లను తేదీలతో సహా స్పష్టంగా ఆ స్థూపాలపై పెట్టి గిరిజన సోదరులకు జోహార్లు అంటూ నినాదాలు చేర్చారు.

అమరవీరుల వారోత్సవాల్లో ఆదివాసీపోలీసుల ప్రయత్నాలు ఫలించినట్టు కనిపిస్తోందని పోలీసు వర్గాలు వివరిస్తున్నాయి. మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనుల్లో పోలీసులు చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు ఫలించేలా ఈ శాంతి స్థూపాలు ఈ సారి దర్శనమివ్వడం ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చకు దారితీసిందంటున్నారు. గిరిజనుల్లో మావోయిస్టులపై పెరిగిన వ్యతిరేకతకు ఇదొక ఉదాహరణ అంటూ పోలీసు ఉన్నాతాధికారులు పేర్కొంటున్నారు.

ఆంద్రా ఒడిశా సరిహద్దులో ఈనెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులో పోలీసు బలగాలు తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే వారోత్సవాలపై నిఘా సారించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దులలో వచ్చే నెల 3వ తేదీ వరకు డోన్ల సహాయంతో మావోయిస్టుల కదలికలపై నిఘా సారిస్తున్నట్లు పోలీసు అధికారులు వివరిస్తున్నారు.

ఇదిలావుండగా తెలంగాణాలో మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కోటిపల్లి మండలం, అర్జున్ గుట్ట, రాపన్‌పల్లి, గడ్చిరోలి జిల్లా సిరోంచా ప్రాంతాల్లో డ్రోన్‌తో పహారా కాస్తున్నారు. ప్రాణహితనది పరివాహక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాణహిత నది పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా సారిస్తున్నారు.

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు ఏవోబీలో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కేంద్ర బలగాలను రంగంలోకి దింపి అడవిని జల్లెడపడుతున్నారు. 

ఈ సారి ఏకంగా డ్రోన్లను రంగంలోకి దింపి నిఘా పెంచారు పోలీసులు. గ్రామాల్లో శాంతి ర్యాలీలునిర్వహించి గిరిజనుల్లో చైతన్యం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల సంచారం పెరిగిందని నిఘా వర్గాల సమాచారంతో అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు గిరిజనులకు సూచిస్తున్నారు.