ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను, ఫామ్ హౌస్‌ను ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నుతాం

2023లో తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రాగానే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను, ఫామ్ హౌస్‌ను ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నుతామ‌ని, ఆ భూమిని ప్ర‌జ‌ల‌కు పంచుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.  బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మోర్చాల ఆ«ధ్వర్యంలో నిర్వహించిన ‘బడుగుల ఆత్మ గౌరవ పోరు’ సభలో పాల్గొంటూ  పోడు భూముల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పిన కేసీఆర్, ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారని మండిప‌డ్డారు.

అలాగే ప్రగతి భవన్‌ గేట్లు బద్దలు కొట్టి అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహ నిర్మాణానికి మొదటి సంతకం చేస్తామని స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు

ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమిని ఇస్తామ‌ని చెప్పిన కేసీఆర్, ఒక్కొక్క ద‌ళితుడికి రూ.10 ల‌క్ష‌లు కాదు, రూ.30 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో 18 శాతం ధ‌ళితులు ఉన్నార‌ని, వారిలో ఏ ఒక్క‌రికీ ముఖ్య‌మంత్రి అయ్యే అర్హ‌త‌లు లేవా అని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఫేక్ ఐడీలు సృష్టించి ద‌ళితుల‌ను మోసం చేస్తున్నారని విమర్శించారు.

దేశంలో సామాజిక న్యాయం అమలుచేసిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని సంజయ్ స్పష్టం చేశారు. ఒక బీసీని ప్రధాని, ఒక దళితుడిని రాష్ట్రపతిగా చేసిన ఘటన బీజేపీకే దక్కుతోందని గుర్తు చేశారు. కాంగ్రెస్-టీఆర్‌ఎస్ పార్టీలు బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప, వారి చేతికి అధికారం ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు.

ఈ దేశంలో సామాజిక న్యాయం బీజేపీ వల్లే సాధ్యం అనిపేర్కొంటూ కేంద్రంలో 81 మంది మంత్రులుంటే 27 మంది ఓబీసీలకు, 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు, 5 గురు మైనారిటీలకు స్థానం కల్పించిన ఘనత నరేంద్ర మోదీదే అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేస్తూ కేసీఆర్ సాగిస్తున్న దుర్మార్గాలను తెలియజేసి ప్రజలను చైతన్యపర్చేందుకే ‘బడుగుల ఆత్మ గౌరవ పోరు’ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హుజురాబాద్‌లో జరుగుతుంది ఉపఎన్నికలు కావని, కేసీఆర్‌కు బైయింగ్ ఎలక్షన్స్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై సీఎంకు చితశుద్ది లేదని విమర్శించారు. పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేయిస్తున్నారని, ఫారెస్ట్ అధికారులను పంపి పోడు రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈటల బావమరిది చాటింగ్‌పై విచారణ జరిపించాలని సవాల్ చేశారు. నిజంగా ఆయన తప్పు చేస్తే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బడుగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు బీజేపీ సిద్ధమవుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్‌ చేతిలో బందీ అయిన తెలంగాణను విముక్తం చేయడమే బీజేపీ లక్ష్యమని సంజయ్ ప్రకటించారు. బడుగుల సమస్యలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్ల కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వెల్లడించారు.

ప్రజాస్వామిక తెలంగాణ సాధనకు అందరూ కలసి రావాలని, గడీల పాలనను బద్దలు కొట్టడానికి బండి సంజయ్‌ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రకటించా రు. బీసీల నేత మోదీని ప్రధానిగా, దళితుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనని గుర్తు చేశారు. 

దళితులను మోసం చేసిన కేసీఆర్‌ను అడుగడుగునా అడ్డుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. దళిత బంధును రాష్ట్రమంతా అమలు చే యాలని ఆమె  డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం వై.ఎస్‌. జగన్‌ను చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలని, పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్‌ చేశారు. దళితులకు ఇచ్చిన భూములపై సీఎం కేసీఆర్‌ శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. 

ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునంన్‌రావు, పార్టీనేతలు కె.స్వామిగౌడ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, జి. విజయరామారావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.