సాయిరెడ్డికి సిఐడి సునీల్ కుమార్ తోడు దొంగా?

ఏపీ సిఐడి అధిపతి సునీల్ కుమార్ తనకు ఎవ్వరితోనే సంబంధాలున్నాయని, ఒక దగ్గర్నుంచి తనకు నిధులు వస్తున్నాయని అంటూ మెస్సేజ్ లు సృష్టించి, సుప్రీం కోర్టులో  పిటీషన్ వేస్తే దాని ప్రతులు `సాక్షి’ పత్రికకు, వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేతికి ఎట్లాగు వచ్చాయని ఆ పార్టీ `తిరుగుబాటు’ ఎంపీ  రఘురామకృష్ణరాజు విస్మయం వ్యక్తం చేశారు. 
 
అంటే సునీల్ కుమార్ – సాయిరెడ్డి తోడు దొంగలా? అని ప్రశ్నించారు. ఇడి లోని ఒక జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ కు ఫిర్యాదు చేస్తే, దాని ప్రతి వైసీపీ `దొంగల’ చేతికి ఎలా వచ్చింది? ఈ ఫిర్యాదులపై బ్లాక్ మెయిల్ వ్యవహారాలు కూడా నడుస్తున్నాయని ఆరోపిస్తూ, త్వరలో వివరాలు బైట పెడతానని వెల్లడించారు. 
 
తన ఫోన్ ను తీసుకున్న సీఐడీ డీజీ సునీల్ కుమార్.. ఆ ఫోన్ నుంచి కొందరికి సందేశాలు పంపారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఆ ఫోన్‌ను వాడకుండానే, దాని నుంచి సందేశాలు పంపగల ఘనుడు సునీల్ కుమార్ అని పేర్కొంటూ గతంలో కూడా సునీల్‌కుమార్‌కు ఆయన భార్యతో మనస్పర్ధలు వచ్చాయని గుర్తుచేశారు. 
 
అయితే భార్య ఉపయోగించే కంప్యూటర్ లోకి ఆమె అనుమతి లేకుండా చొరబడి, ఆ కంప్యూటర్ నుంచి ఇతరులకు సందేశాలు పంపారని, ఈ విషయం రికార్డుల్లో కూడా ఉందని పేర్కొన్నారు. తన ఫోన్ నెంబరును ఉపయోగించి కూడా అదే విధంగా సందేశాలు పంపారని రఘురామ ఆరోపించారు. పీవీ రమేశ్ అప్రమత్తం చేయడంతో తనకు అసలు విషయం తెలిసిందని చెప్పారు.
అప్పట్లో న్యాయమూర్తులపైనా ఓ సాఫ్ట్ వేర్ ప్రయోగించారని పత్రికా కథనం వచ్చిందని రఘురామ గుర్తు చేశారు. సునీల్ కుమార్ పెగాసస్ తరహా సాఫ్ట్ వేర్ లు ఉపయోగిస్తూ ఇలాంటి సందేశాలు రూపొందిస్తున్నారని ఆరోపించారు. తనకు ఎవరితోనో సంబంధం ఉందని, అవతలి నుంచి కొంత అమౌంట్ వస్తుందని ఓ సందేశం రూపొందించారని పేర్కొంటూ కానీ అది తన అకౌంట్ కాదు, తనకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు.
కానీ దాని ఆధారంగా సునీల్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు, ఈడీ జాయింట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు, ఆ పిటిషన్ తాలూకు ప్రతి సాక్షికి వచ్చినట్టు చెబుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు.
సునీల్ కుమార్ చేసిన మతాన్ని రెచ్చగొట్టే వాఖ్యలపై తాను వీడియోల ఆధారాలతో చేసిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ దర్యాప్తు చేయవలసిందిగా డిఓపిటిని ఆదేశించున్నట్లు తనకు సమాచారం అందినదని ఆయన చెప్పారు. ఈ దర్యాప్తు నుండి ఎవ్వరు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాలపై సిబిఐ దర్యాప్తు కోరుతూ తాను సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయనున్నట్లు ఆయన వెల్లడించారు.