దేవినేని ఉమా అరెస్ట్…. టిడిపి, వైసిపి వర్గాల రాళ్ళ దాడులు 

మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత గత అర్ధరాత్రి దాటాక కృష్ణ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు జికొండూర్ మండలంలో నాటకీయ సంఘటనలతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకొంది. వైసిపి – టిడిపి కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఉమా కారు అద్దాలతో పాటు ఓ వైసీపీ నేత కారు కూడా ధ్వంసమైంది. 
 
ఈ దాడులకు దేవినేని ఉమా కారణం అనే ఆరోపణతో పోలీసులు ఆయనపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అయితే టిడిపి శ్రేణుల వాదన అందుకు భిన్నంగా ఉంది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమను అరెస్ట్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. తమపై దాడిచేసిన వారిని వదిలివేసి, ఫిర్యాదు చేసిన తననే అరెస్ట్ చేస్తారా అంటూ ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
టిడిపి వర్గాల కధనం ప్రకారం దేవినేని ఉమ కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. ఇక్కడ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, ఆయన బావమరిది అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  ఆ తర్వాత జి.కొండూరు వైపు బయల్దేరారు.
ఇది తెలుసుకున్న వసంత అనుచరులు వందల సంఖ్యలో గడ్డమణుగు-మునగపాడు మధ్య ఉమా కారును చుట్టుముట్టారు. ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఉమ వెంట ఉన్న కార్యకర్తలు సెల్‌ఫోన్లలో క్వారీ ఫొటోలను తీయడంతో.. వారి నుంచి ఫోన్లను లాక్కుని నేలకేసి కొట్టారు. దొరికిన వారిని దొరికినట్లు కొట్టడంతో టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీశారు.
విషయం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల టీడీపీ కార్యకర్తలు హుటాహుటిన అక్కడకు చేరుకుని మాజీ మంత్రికి రక్షణగా నిలిచారు. వారిపైనా వైసీపీ శ్రేణులు పిడిగుద్దులు కురిపించాయి. వారికి చిక్కకుండా ఉమ తప్పించుకున్నారు. గొడవ ముగిసిన అనంతరం పోలీసులు ఆయన్ను జి.కొండూరు పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడకు వచ్చి ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చారు.
అయితే, స్థానిక మగడ్డమణుగు ప్రాంతంలో జరగనున్న కాలనీ నిర్మాణం కోసం పనులు జరుగుతుంటే, అక్కడకు  చేరుకున్న ఉమా అక్రమ మైనింగ్ జరుగుతోందని అసత్య ఆరోపణలకు తెరదీశారని వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమా  పిలుపు మేరకే భారీ సంఖ్యలో టిడిపి కార్యకర్తలు అక్కడకు తరలివచ్చి,  వైసిపి నేతలపై వారు దాడులకు పాలపడ్డారన్నీ ఆరోపిస్తున్నారు.
ఇరువర్గాల కార్యకర్తలు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. దేవినేని ఉమను పోలీసులు చాలాసేపు కారు దిగనీయలేదు. తన ఫిర్యాదు స్వీకరిస్తేనే కారు దిగుతానని ఉమా భీష్మించుకుని కూర్చున్నారు. చివరకు బలవంతంగా ఆయనను పోలీసులు కారు నుంచి దించి, రాత్రి 1.30 గంటల ప్రాంతంలో స్టేషన్ కు తరలించి అరెస్ట్ చేశారు.