కేసీఆర్ దర్శకత్వం… బిఎస్పీలోకి ప్రవీణ్ కుమార్ 

రాష్ట్రంలో  తమకు మద్దతు వేగంగా పడిపోతున్నట్లు గ్రహిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకు రావడం ద్వారా వచ్చే ఎన్నికలలో కూడా గట్టెక్కాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 
 
ఒక వంక ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉన్న ఒక బలమైన సామజిక వర్గం ఓట్లర్లలో చీలిక తీసుకు రావడం కోసం మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిలతో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఆమె నిత్యం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా ఆమె అసలు లక్ష్యం ప్రతిపక్షాలు బలపడకుండా, వారి మద్దతుదారులతో చీలిక తీసుకు రావడమే అని స్పష్టం అవుతున్నది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం వంటి అంశాలపై ఆమె నోరెత్తకపోవడం గమనార్హం. 
 
మరోవంక గత రెండు ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ కు మద్దతుగా ఉంటున్న దళిత్ వర్గాలు దూరం కావడాన్ని గ్రహించి, వారు ప్రతిపక్షాలకు దగ్గర కాకుండా, వారిని కట్టడి చేయడం కోసం ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే దళిత్ లకు బలమైన వేదికగా మారడం కోసం బిఎస్పీలో చేరనున్నట్లు స్పష్టమైనది. 
 
స్వయంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రవీణ్ కుమార్ తమ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. తనను తెలంగాణ బీఎస్పీ అధ్యక్షునిగా చేయనున్నట్లు రాజీనామా చేసినప్పటి నుండి ప్రవీణ్ కుమార్ మద్దతుదారులతో చెబుతూనే ఉన్నారు. మాయావతి ప్రకటన తర్వాత ఆయన కూడా బిఎస్పీలో చేరడం గురించి నిర్ధారణ చేశారు. 
 
ఈ క్రమంలోనే ఆయన గతంలో యూపికి వెళ్లి మాయవతిని కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. బీఎస్పీ నాయకత్వంతో కేసీఆర్ కు చాలాకాలంగా లోపాయికారి సంబంధాలు ఉండడం తెలిసిందే. కేసీఆర్ దర్శకత్వంలోనే ముందస్తు వ్యుహంలో భాగంగానే ఆయన ఐపీఎస్ కు రాజీనామా సమర్పించారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. 
 
ఆయన రాజీనామా ప్రకటించగానే హుజారాబాద్ ఉపఎన్నికలలో టి ఆర్ ఎస్ అభ్యర్హ్దిగా పోటీచేయబోతున్నట్లు వార్త కేసీఆర్ సన్నిహిత వర్గాల నుండే లీక్ కావడం గమనార్హం. ప్రజలలో, ప్రతిపక్షాలలో గందరగోళం సృష్టించడం కోసమే ఈ విధంగా చేసిన్నట్లు కనిపిస్తున్నది. 
 
ముందుగా తాను రాజకీయాల్లో రానన ప్రకటించిన ప్రవీణ్ కుమార్  బడుగుల బలహీన వర్గాల అభివృద్ది కోసం ముందుకు వస్తానని వెల్లడించారు. ఆయా వర్గాల అభ్యున్నతికోసం కృషి చూస్తుంటానని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఒక రాజకీయ వేదిక కోసం బిఎస్పీని ఎంచుకున్నట్లు స్పష్టం అయింది. 
 
కాగా గతంలో కూడా బీఎస్పీ నుండి తెలంగాణకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడం గమనార్హం. పార్టీ టికెట్ రాకపోవడంతో ప్రస్తుత మంత్రి ఐకేరెడ్డితో పాటు ఎమ్మెల్యే కోనప్పలు ఇద్దరు బీఎస్పీ నుండే టికెట్ సాధించి 2014 ఎన్నికల్లో గెలుపొందారు.అనంతరం ఇద్దరు కూడా టీఆర్ఎస్‌లో విలీనం అయ్యారు. ఇప్పుడు కూడా   టీఆర్‌ఎస్‌ ను ఆదుకోవడం కోసమే బిఎస్పీని ఉపయోగించుకున్నట్లు భావించవలసి వస్తున్నది. 
 
హుజురాబాద్ ఉపఎన్నికలలో తాను పోటీ చేయబోతున్నట్లు వస్తున్న కథనాలను కొట్టిపారవేస్తూ, తనను రెచ్చగొడితే నిజంగానే పోటీ చేస్తానని అంటూ తాజాగా బెదిరిస్తున్నారు. ఇప్పుడేమో బీఎస్పీ తరపున బలమైన అభ్యర్థి దొరికితే పోటీ చేపిస్తాననే సంకేతం ఇస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న దళితుల ఓటర్లు ఈటెల రాజేందర్ వైపు మొగ్గు చూపకుండా చేయడం కోసం, తమ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ప్రతిపక్షాలను బలహీనం చేసే ఎత్తుగడలో భాగంగా బీఎస్పీ అభ్యర్థి పోటీ చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.