క‌ర్నాట‌క సీఎంగా బ‌స‌వ‌రాజు బొమ్మై ప్ర‌మాణ‌స్వీకారం

క‌ర్నాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా ఇవాళ బ‌స‌వ‌రాజు బొమ్మై ప్ర‌మాణ స్వీకారం చేశారు. బెంగుళూరులో ఉన్న రాజ్‌భ‌వ‌న్‌లో ఆయ‌న ప్రమాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. బుధవారం ఉదయం 11 గంటలకు బొమ్మైతో గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. అంతకు ముందు ఆయన బీజేపీ కేంద్ర పరిశీలకుడు ధర్మేంద్ర ప్రధాన్, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో భేటీ అయ్యారు.

ప్రమాణస్వీకారానికి వెళ్లే ముందు బెంగళూరులోని మారుతీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప, కేంద్ర మంత్రులు ధరేంద్ర ప్రధాన, జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ అరుణ్ సింగ్, పార్టీ నేతలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు రాజ్ భవన్ వద్దకు చేరుకొని హర్షధ్వానాలు చేసారు. 

ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడుతూ తాను కొద్దిసేపు మంత్రులతో సమావేశమై, తర్వాత కరోనా, వరదల పరిస్థితులపై అధికారులతో సమీక్ష జరుపనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.  కాగా,ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేందర్ మోదీని మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలవగలరని బిజెపి వర్గాలు తెలిపారు. 

క‌ర్నాట‌క రాష్ట్ర 23వ సీఎంగా ఆయ‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఆ రాష్ట్ర‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌ఆర్‌ బొమ్మై తనయుడే బసవరాజు బొమ్మై. బ‌స‌వ‌రాజు బొమ్మై వ‌య‌సు 61 ఏళ్లు.  బీఎస్ య‌డియూరప్ప (యెడ్డీ) ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. యెడ్డీలాగే బొమ్మై కూడా రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన లింగాయత్‌ వర్గానికి చెందినవారు.

శాసనసభా పక్ష సమావేశంలో బొమ్మై పేరును యెడియూరప్ప ప్రతిపాదించగా పలువురు బలపరిచారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్  బొమ్మైతో ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

ఇంజనీర్‌ నుంచి సీఎంగా

బసవరాజ్‌ బొమ్మై సదర లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందినవారు. యెడ్డీకి అత్యంత నమ్మకస్తుడు. మెకానికల్‌ ఇంజనీర్‌ అయిన బొమ్మై పుణెలోని టాటా గ్రూపులో తన కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత జనతాదళ్‌ (ఎస్‌)తో రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నేతలు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం దివంగత రామకృష్ణ హెగ్డేతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. 

విద్యావంతుడైన బొమ్మైకి అన్ని పార్టీలలో మిత్రులు ఉన్నారు. ప్రభుత్వంకు ఎప్పుడు సంక్షోభం ఎదురైనా పరిష్కారం కోసం రంగంలోకి దిగేవారు. హోంశాఖతో పాటు శాసనసభా వ్యవహారాలు, న్యాయ శాఖను నిర్వహించారు. గతంలో జల వనరుల మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హవేరి జిల్లాలోని షిగ్గోన్‌ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

1956 నుంచి ఇప్పటి వరకు 20 మంది సీఎంలుగా పనిచేయగా వారిలో 8 మంది లింగాయత్‌ కమ్యూనిటీకి చెందినవారే. యెడ్దీ వీరశైవ లింగాయత్‌. తమకు ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లను కాదనే సాహసం బీజేపీ చేయకుండా అదే సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్‌ బొమ్మైను ఎంపిక చేసింది.

తండ్రి తర్వాత సీఎం పీఠం 

తండ్రిలాగే సీఎం పీఠాన్ని అధిష్టించిన తనయులు దేశ రాజకీయాల్లో కొత్త కాదు. కర్ణాటక సీఎంగా ప్రమాణం చేసిన బసవరాజ్‌ బొమ్మై తాజాగా ఆ జాబితాలో చేరారు. బసవరాజ్‌ బొమ్మై తండ్రి సోమప్ప రామప్ప బొమ్మై (ఎస్‌ఆర్‌ బొమ్మై) 1988-1989లో కర్ణాటక సీఎంగా పనిచేశారు. హెచ్‌డీ దేవెగౌడ, తర్వాత ఆయన కుమారుడు కుమారస్వామి కూడా కర్ణాటక సీఎం పదవిని చేపట్టారు. 

అలాగే ఇతర రాష్ట్రాల్లో తమ తండ్రుల్లాగే సీఎంలు అయిన తనయుల జాబితాను చూస్తే… ఎం.కరుణానిధి-ఎంకే స్టాలిన్‌ (తమిళనాడు), వైఎస్‌ రాజశేఖరరెడ్డి-వైఎస్‌ జగన్‌ (ఏపీ), బిజూ పట్నాయక్‌-నవీన్‌ పట్నాయక్‌ (ఒడిశా), దోర్జీ ఖండూ-పెమా ఖాండూ (అరుణాచల్‌ ప్రదేశ్‌), శిబూ సోరేన్‌-హేమంత్‌ సోరేన్‌ (జార్ఖండ్‌) ఉన్నారు. 

వారితో పాటు, ములాయం సింగ్‌ యాదవ్‌-అఖిలేశ్‌ యాదవ్‌ (యూపీ), హేమావతి నందన్‌ బహుగుణ (యూపీ)-విజయ్‌ బహుగుణ (ఉత్తరాఖండ్‌), దేవీలాల్‌-ఓం ప్రకాశ్‌ చౌతాలా (హర్యానా), శంకర్‌రావు చౌహాన్‌-అశోక్‌ చౌహాన్‌ (మహారాష్ట్ర). జమ్ముకశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబంలో మూడు తరాల నేతలు తాత-తండ్రి-కొడుకు సీఎంలు అయ్యారు. ఆ ఘనతను షేక్‌ అబ్దుల్లా, ఫరూక్‌, ఒమర్‌ దక్కించుకున్నారు. కశ్మీర్‌లోనే తండ్రి-కుమార్తె (ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌-మెహబూబా ముఫ్తీ) సీఎంలు అయ్యారు.