రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో యునెస్కో చేర్చించింది. కాకతీయ రుద్రేశ్వర ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కాకతీయుల నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న చారిత్రక కట్టడం రామప్ప.  

చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఆలయం కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. 

జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించినా, రష్యా సహా 17 దేశాలు ఆమోదం తెలిపాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించేందుకు 9 లోపాలున్నట్టు యునెస్కో బృందం అభ్యంతరాలు వ్యక్తం చేసినా భారత్ ప్రభుత్వం అనూహ్య దౌత్య ప్రయత్నాల ద్వారా   24 దేశాలకు రామప్ప ఆలయ విశిష్టతలను వివరించి, మద్దతును కూడగట్టుకో గలిగింది.

వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రూల్ 22.7ను ప్రయోగించి రామప్పను  నామినేషన్‌లలో పరిగణలోకి తీసుకునేలా రష్యా చేసింది. రష్యాకు ఇథియోపియా, ఒమన్, బ్రెజిల్, ఈజిప్ట్, స్పెయిన్, థాయిలాండ్, హంగేరి, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా తదితర దేశాల మద్ధతిచ్చాయి. 

ఈ విషయాన్ని కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌విజ్‌.అధికారికంగా ప్రకటించారు. 2020 ఏడాదికి గాను రామప్పకు ఈ హోదా దక్కింది. 2021 ఏడాది నామినీగా గుజరాత్‌కి చెందిన ధోలవీర ఆలయం వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌  బరిలో ఉంది. ఇప్పటివరకు ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాల నుంచి 1,121 కట్టడాలు ఉన్నాయి. 

తెలంగాణలోని రామప్ప దేవాలయానికి  ప్రపంచ వారసత్వ హోదా  గుర్తింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  శుభాకాంక్షలు చెప్పారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రజలందరికి అభినందనలు తెలిపారు.  ‘కాకతీయ రాజవంశం యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆలయాన్ని సందర్శించి, దాని గొప్పతనం గురించి మొదటి అనుభూతిని పొందాలని నేను మీ అందరిని కోరుతున్నాను‘అంటూ ట్వీట్ చేశారు. 

కాకతీయ రుద్రేశ్వరాలయం (రామప్ప)  యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం యావత్ దేశానికి ఎంతో ఆనందకరమైన విషయమని ట్విట్టర్‌లో కేంద్రహోమంత్రి అమిత్ షా సంతోషం ప్రకటించారు.  ఈ దిగ్గజ ఆలయం గొప్ప భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, హస్తకళకు చక్కటి ఉదాహరణ అని ఆయన తెలిపారు. ఇది దేశం గర్వించదగిన క్షణమని అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. 

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపుపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాకతీయ రాజులు రామప్ప ఆలయాన్ని అత్యంత సృజనాత్మకంగా కట్టారని పేర్కొంటూ తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

పూర్వపు వరంగల్‌ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో ఉంది.. రామప్ప దేవాలయం. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కాకతీయ శివుని మీద ఉన్న ఆపారమైన భక్తితో 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. 

ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. 800 ఏళ్ల సంస్కృతీ, సంప్రదాయాలకు దర్పణం పడుతూ తెలంగాణ ప్రాంత చారిత్రక కీర్తిని ప్రపంచానికి చాటిచెబుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువ. ఎక్కువ బరువు ఉండే రాతి నిర్మాణాలను ఈ నేలలు తట్టుకోలేవు. అందుకే నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఇంజనీరింగ్‌ నైపుణ్యం ప్రదర్శించారు. దీన్ని నేటి ఇంజనీర్లు శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీగా పేర్కొంటున్నారు. 

ఆలయం నిర్మాణ స్థలంలో మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపారు. ఈ ఇసుక ఎప్పుడు తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇసుకపరై రాళ్లను పేర్చుకుంటూ పోయి కక్ష్యా మంటపం వరకు నిర్మించారు. అక్కడి నుంచి ఆలయ నిర్మాణం చేపట్టారు.  

నేల స్వభావాన్ని బట్టి ఆలయం బరువును తగ్గించేందుకుద అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు. సాధారణ నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. కానీ రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకలు కేవలం 0.8 సాంద్రతను కలిగి ఉంటాయి. అందుకే ఇవి తక్కువ బరువు కలిగి ఉండి నీటిలో తేలియాడుతాయి.

ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ అద్భుత ఆలయంపై కనువిందుచేసే శిల్ప సౌందర్య రాశులు, సప్త స్వరాలు పలికే స్తంభాలు, చూపరులను ఆకట్టుకునే నంది విగ్రహం, పరవశింపజేసే ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. . ఆలయం నలువైపులా ఉ‍న్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. 

బ్లాక్‌ గ్రానైట్‌ రాయిపై చెక్కిన మదనికల సొగసు వర్ణణాతీతం. ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియన యాత్రికుల శిల్పాలు అబ్బరు పరుస్తాయి. ఇక ఆలయం లోపల నాట్యమంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంలా నిలిచిపోతుంది. సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. అంతేకాదు ఆలయం బరువును మోస్తున్నట్టుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు. అయితే ఒక ఏనుగుతో మరో ఏనుగుకు సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయి. 

ఇక శివుడి ఎదురుగా ఉన్న నంది గురించి వర్ణించడానికి మాటలు చాలవు. శివుడి ఆజ్ఙ కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెవిని లింగం వైపుకు పెట్టి.. లేవడానికి తయారుగా ఉన్నట్టుగా నందిని మలిచాడు శిల్పి రామప్ప. 

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా కృషి చేస్తోంది. గత జూన్ 23 న రాష్ట్రానికి చెందిన నేతలు, మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రిని కలిశారు. రామప్పకు ప్రవంచ వారసత్వ హోదా వచ్చేలా కృషి చేయాలని కోరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం  రామప్ప దేవాలయంతో పాటు గుజరాత్ లోని సింధు నాగరికత నాటి వట్టణమైన ధోలవీరను యూనెస్కో ప్రవంచ వారసత్వ ప్రదేశాల జాబితాకు నామినేట్ చేసింది.