కేసీఆర్ రైతులను తక్షణమే ఆదుకోవాలి!

భారీ వర్షాల వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో వర్షాల వల్ల పంట నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తూ రైతులు పడుతున్న బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిండ్రని చెబుతూ వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుకోవాలని కోరారు. 

కరీంనగర్ జిల్లాలోని రైతుల పొలాలతోపాటు మానేరు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారి ఇండ్లు మునిగిపోయి తీవ్ర ఆస్తి నష్టం ఏర్పడింది. రైతులకు రైతు బంధు డబ్బులు కూడా బ్యాంకుల్లో సరిగా జమ కావడం లేదు. ఏం చేయాలో తెలియక నానా కష్టాలు పడుతున్నరు. కానీ సీఎం కేసీఆర్ కు మానవత్వం లేదని ధ్వజమెత్తారు.

ఎన్నికల కోసం కొత్త కొత్త జిమ్మిక్కులు చేస్తున్నడే తప్ప రైతులను ఆదుకోవాలనే కనీస సోయి కూడా లేకుండాపోయిందని విస్మయం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా తాము  ఏది మాట్లాడినా కేంద్రం ఏం చేస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నరు? అన్నింటికీ కేంద్రమే చేస్తే ఇక ఈ ముఖ్యమంత్రి ఎందుకు? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.

పేరు, ప్రఖ్యాతుల కోసం రాజకీయం చేయడమే తప్ప పేదలను, రైతులను ఆదుకోవడానికి మాత్రం కేసీఆర్ ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు. పైగా నిర్మాణాత్మక సలహాలిస్తున్న ప్రతిపక్ష పార్టీలను పట్టించుకోకుండా ప్రతి విమర్శలతో ఎదురుదాడి చేయడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ భూములను తెగనమ్మి వేల కోట్ల రూపాయలు పోగేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? అని ప్రశ్నించారు. కనీసం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా అమలు చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు.

గత కొన్నేళ్లుగా వడగండ్లు, అకాల వర్షాలతో లక్షలాది రైతుల పంట పొలాలు మునిగిపోయినయ్. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. పశువులు చనిపోయినయ్. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతును ఆదుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా జిమ్మిక్కులు, విమర్శలు మానుకుని పంట నష్టం అంచనా వేయాలి. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.