వారసత్వ కట్టడంగా రామప్ప… మోదీకి కృతజ్ఞతలు

కాకతీయుల కళాత్మక వైభవానికి చిహ్నం, 800 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన రామప్ప ఆలయం యునెస్కో (యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ సైంటిఫిక్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌) ప్రపంచ వారసత్వ సంపద హోదా సాధించేందుకు కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదపడంతో చైనాలో జరిగిన యునెస్కో సమావేశం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో కొలువైన ప్రఖ్యాత రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. 

రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి సంబంధించి నామినేషన్‌ 2019లో దాఖలు కాగా, అదే ఏడాది రామప్పను సందర్శించిన ‘అంతర్జాతీయ స్మారకాలు, స్థలాల మండలి (ఐసీవోఎంవోఎస్‌)’ తొమ్మిది లోపాలను ఎత్తిచూపింది.

దీంతో భారత్‌ దౌత్యపరమైన చర్యలకు ఉపక్రమించి ప్రపంచ వారసత్వ కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) ఓటింగ్‌లో పాల్గొననున్న దేశాలకు రామప్ప గొప్పతనాన్ని వివరించింది. దానికి యునెస్కో గుర్తింపు దక్కాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. దీంతో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా లభించింది. 

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కృషితోనే రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు సాధ్యమైందని సంజయ్ పేర్కొన్నారు. ప్రధానిని కలిసి అభినందించిన వారిలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు.