ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి యెడియూర‌ప్ప రాజీనామా

ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి యెడియూర‌ప్ప రాజీనామా
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూర‌ప్పనేడు తన పదవికి రాజీనామా చేశారు. నాలుగేసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు అయిన సందర్భంగా విధాన్ సౌధలో జరిగిన పార్టీ ఎమ్యెల్యేల సమావేశంలో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ఉదయం ప్రకటించారు. 
 
ఆ తర్వాత రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తావ‌ర్‌చంద్ గెహ్లాట్ ను కలసి తన రాజీనామా సమర్పించగా, ఆయన వెంటనే ఆమోదం తెలిపారు.  అయితే, త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం చేసేవ‌ర‌కు రాష్ట్రానికి ఆపార్ధర్మ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించాల‌ని ఆయన సూచించారు. కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా పేరొందిన యెడియూర‌ప్ప దక్షిణాదిగా తొలిసారిగా కర్ణాటకలో బిజెపిని అధికారమలోకి తీసుకొచ్చిన ఘనత దక్కుతుంది. ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా, ఎప్పుడు పూర్తికాలం పదవిలో ఉండలేక పోయారు. 
 
సరిగ్గా పదేళ్ల క్రితం జులై చివరి వారంలోనే ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం గమనార్హం. బీజేపీలో 75 ఏళ్ళ వయస్సు దాటినా వారెవ్వరూ పార్టీలో,  ప్రభుత్వాలలో ఎటువంటి పదవులు చేపట్టరాదని నిబంధనను అనధికారికంగా అమలు పరుస్తున్న బిజెపి నాయకత్వం అభీష్టం మేరకు ఆయన రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తున్నది. 
 
ఆయన వయస్సు 78 ఏళ్ళు. పార్టీ నిబంధనను పక్కన పెట్టి ఇంతకాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించడం ద్వారా పార్టీ నాయకత్వం తన పట్ల ఎంతో ప్రేమ చూపినదని గత వారం ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. తనకు పదవి కన్నా పార్టీ, ప్రజలకు సేవచేయడమే ముఖ్యం అని స్పష్టం చేశారు. 
 
ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాలతో సమావేశమైన సందర్భంగా ఆయన రాజీనామా అంశం ప్రస్తావనకు వచ్చిన్నట్లు కధనాలు వెలువడ్డాయి. అయితే ఆయన అభీష్టం మేరకు రెండేళ్ల పదవి పూర్తి చేసుకున్న తర్వాతనే రాజీనామా చేశారు. 
 
కాగా,  క‌ర్ణాట‌క రాష్ట్ర కొత్త ముఖ్య‌మంత్రిగా ఎవ‌రిని నియ‌మిస్తే బాగుంటుంద‌నే విష‌యంలో తాను ఎవ‌రి పేరును సిఫార‌సు చేయ‌బోన‌ని రాజీనామా అనంతరం యెడియూర‌ప్ప చెప్పారు. త‌న రాజీనామా కోసం ఎవ‌రూ ఎలాంటి ఒత్తిడి చేయ‌లేద‌ని, కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డం కోసం తానే స్వ‌చ్ఛందంగా ప‌ద‌వి నుంచి వైదొలిగాన‌ని ఆయ‌న స్పష్టం చేశారు. 

అధిష్ఠానం క‌ర్ణాట‌క కొత్త ముఖ్య‌మంత్రిగా ఎవ‌రిని నియ‌మించినా తాము అత‌ని నాయ‌క‌త్వంలో ప‌నిచేస్తామ‌ని యెడియూర‌ప్ప భరోసా వ్యక్తం చేశారు. తాను నూటికి నూరు శాతం కొత్త ముఖ్య‌మంత్రికి స‌హ‌క‌రిస్తాన‌ని, అదేవిధంగా త‌న మ‌ద్ద‌తుదారులు కూడా వ‌చ్చే సీఎంకు 100 శాతం స‌హ‌కారం అందిస్తార‌ని యెడ్డీ స్ప‌ష్టంచేశారు. 

ఈ విష‌యంలో ఎలాంటి అనుమాన‌ము, అసంతృప్తి అక్కెర లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావ‌డం కోసం త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని యెడ్డీ చెప్పారు. ఉదయం పార్టీ ఎమ్యెల్యేల సమావేశంలో మాట్లాడుతూ తన 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని తలచుకొంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

తిరగడానికి వాహనాలు కూడా లేని రోజులలో సైకిల్ పైననే తిరుగుతూ పార్టీ కోసం పని చేశానని చెప్పారు. పండిట్ దీనదయాళ్ ఉపాధాయాయ్, అటల్ బిహారి వాజపేయి, మురళీమనోహర్ జోషి వంటి నేతల స్పూర్తితో,  రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన్నట్లు చెప్పుకొచ్చారు. 

సర్వోదయ ద్వారా అంత్యోదయ అనే పార్టీ విధానం నెరవేర్చడం ద్వారా రైతులు,  బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం పనిచేస్తూ వచ్చానని తెలిపారు. అయితే తొలినుండి అనేక సమస్యలు ఎదురవుతూ తనకు `అగ్నిపరీక్ష’ పెడుతూ వచ్చాయని చెప్పారు. 

 “జగజ్యోతి బసవన్న  కయాకా, దాసోహా తత్వ, సిద్దగంగ మఠానికి చెందిన లింగైక్య శ్రీ శివకుమార స్వామీజీ తత్వశాస్త్రం ద్వారా బాగా ప్రభావితమైంది, నా 50 సంవత్సరాల ప్రజా జీవితాన్ని దేశ నిర్మాణానికి అంకితం చేశాను. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాను” అంటూ ఒక ట్వీట్ లో సంతృప్తి వ్యక్తం చేశారు.