బీజేపీ గోవా సీఎం అభ్యర్థి ప్రమోద్ సావంత్!

వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా స్పష్టం చేశారు. ఒకరోజు గోవా పర్యటనకు వచ్చిన ఆయన ఈ విషయమై నెలకొన్న అస్పష్టతను తొలగించారు. 

గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ఆయనతోనే (ముఖ్యమంత్రి అభ్యర్థిగా) ఎన్నికలకు బీజేపీ వెళ్తుందని నడ్డా వెల్లడించారు.  సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీలో పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటన చేస్తుందని పేర్కొన్నారు. 

అయితే,  గోవాలో వేరే పేర్ల గురించి ఆలోచించాల్సిన పని లేదని, ప్రమోద్ సావంత్ గోవాను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని, చక్కటి పనితీరు ప్రదర్శిస్తున్నారని నడ్డా కొనియాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో తాను జరిపిన సమావేశంలో ఎమ్మెల్యేలు ఎంతో ఆశావవహంగా, ధీమాతో ఉన్నారని చెప్పారు. 

కాంగ్రెస్‌ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు బీజేపీలో చేరుతున్నారని, వారితో తాను సమగ్ర చర్చలు జరిపానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ పనితీరు పట్ల అందరూ సంతృప్తికరంగా ఉన్నారని చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో గోవా గణనీయమైన అభివృద్ధి సాధించిందని ప్రశంసించారు. 

‘స్పూప్‌గేట్’ వివాదంపై అడిగినప్పడు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని, పసలేని ఆరోపణలని ఆయన ఖండించారు. ప్రజా సంబంధిత అంశాలేవీ లేనందునే ఇలాంటి ఆరోపణలకు వాళ్లు దిగుతున్నారని నడ్డా ధ్వజమెత్తారు. 

పార్లమెంట్‌ కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్న అంశాలు నిరాశాపూరితాలు, అవి అసలు అంశాలే కావని పేర్కొన్నారు. ఏం చేయాలో తెలియకనే, పార్లమెంట్‌లో ఇలా అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తు న్నాయని చెప్పారు. అన్ని విషయాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

తన పర్యటన సందర్భంగా నడ్డా  2022లో జరగనున్న శాసన సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన గోవా మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. బీజేపీ అనుబంధ సంస్థల నేతలతో కూడా సమావేశమయ్యారు.