టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు 6 నెలల జైలు శిక్ష

టీఆర్ఎస్ నేత, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు కోర్టు షాకిచ్చింది. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు 6 నెలల జైలు శిక్ష పడిండి. జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. 
 
గత పార్లమెంట్‌  ఎన్నికల ప్రాచారంలో ఓటర్లకు డబ్బులు పంచారనే కేసులో కోర్టు తీర్పునిచ్చింది. 2019 ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలతో మాలోత్ కవితపై బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 
 
అప్పటినుంచి ఈ కేసుపై విచారిస్తున్న న్యాయస్థానం.. తాజాగా తీర్పు వెలువరించింది. కవిత ఓటర్లను ప్రలోభపెట్టారని 6 నెలల జైలు శిక్ష విధించింది. జరిమానా రూ.10వేలు కట్టిన ఎంపీకి తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె తన రాజకీయ జీవితాన్ని 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ప్రారంభించారు. తర్వాత టి ఆర్ ఎస్ లో చేరి, గత లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ  అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 
 
ఇలా ఉండగా, గత ఏప్రిల్ లో ఢిల్లీలో ఆమె నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు  ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి  ముగ్గురు వ్యక్తులు లంచం డిమాండ్‌ చేశారు. 
 
 సీబీఐ సోదాల సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. తాము కవిత పీఏలమంటూ ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని ఇంటి నిర్మాణం అక్రమం అంటూ రూ. 5 లక్షల డబ్బులు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.