మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో మూడ్రోజుల పాటు కురిసిన ముసురు వానతో పాటు రంగారెడ్డి జిల్లా ఎగువ ప్రాంతాల్లో పడ్డ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్సాగర్ (గండిపేట)కు భారీగా వరద నీరు చేరింది. 
 
గురువారం నుంచి హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ 7 గేట్లు, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ 2 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువన ఉన్న మూసీలోకి వదులుతున్నారు. వరద మరింత పెరిగితే చాదర్ ఘాట్, ముసారాంబాగ్లోని లోతట్టు కాలనీలు, మలక్పేటలోని శంకర్నగర్, బస్తీలు నీట మునిగే అవకాశముంది. 
 
వరద నీరు రోజురోజుకి పెరుగుతుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని వారు ఇండ్లను ఖాళీ చేయాలని అధికారులు చెప్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయకుండానే ఇండ్లు, గుడిసెలను ఖాళీ చేసి వెళ్లమని అధికారులు చెప్తున్నారని, ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్లాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
వరద ప్రవాహం పెరగడంతో కొందరు గుడిసెలను ఖాళీ చేసి బంధువుల ఇండ్లకు వెళ్లిపోయారు.  ఎటు పోలేని వారు మాత్రమే అక్కడే ఉంటున్నారు. రాత్రి వేళల్లో  వరద పెరిగితే ఇండ్లు, గుడిసెల్లోకి నీరు వస్తుందన్న భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి పొద్దున్నే తిరిగి వస్తున్నారు. 
 
వరద ముంపు లేకుండా చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నేతలు తర్వాత పట్టించుకోవడం లేదని ముసారాంబాగ్లోని వడ్డెర బస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరిపడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇండ్లను ఖాళీ చేసి వెళ్లడం లేదని వారు చెప్తున్నారు.  కమ్యూనిటీ హాళ్లకు వెళ్తే టైమ్కి ఆహారం ఏర్పాటు చేయడం లేదని, అందుకే తిరిగి ఇండ్లకు వస్తున్నామని మరికొందరు అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం అందిస్తున్నప్పటికీ బల్దియా అధికారులు సకాలంలో అలర్ట్ కావడం లేదు. వర్షాలు ఎక్కువైన తర్వాత రెవెన్యూ, వాటర్ బోర్డు అధికారులు, పోలీసుల సాయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇండ్లను ఖాళీచేయాలని హడావుడిగా హెచ్చరికలు మాత్రం జారీ చేస్తున్నారు.

 
ఇండ్లలోకి నీరు వచ్చే వరకు బల్దియా అధికారులు స్పందించడం లేదని ఆయా ప్రాంతాల జనం వాపోతున్నారు. గతేడాది అక్టోబర్లో కూడా ఇదే విధంగా వరద ప్రవాహం పెరిగిన తర్వాతే ఇండ్లను ఖాళీ చేయించారని గుర్తు చేస్తున్నారు.  వరద తీవ్రతకు సంబంధించి ముందే సమాచారం ఇస్తే ఇండ్లల్లో ఉన్న సామగ్రిని కూడా తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 
 
మూసీ నది బ్యూటిఫికేషన్  పేరుతో రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రిటర్నింగ్ వాల్ ఎందుకు నిర్మించలేకపోతోందని వారు ప్రశ్నిస్తున్నారు. మరో మూడ్రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ ప్రవాహం పెరుగుతోంది. 
 
మళ్లీ వర్షాలు పడితే హిమాయత్, ఉస్మాన్సాగర్కి చెందిన మరిన్ని గేట్లు ఎత్తే అవకాశముంది. దీంతో మూసీలోకి  మరింత భారీగా వరద చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికారులు ముందస్తుగా అల్టర్ అయితే జనాలు ఇబ్బందులు పడకుండా చూడొచ్చంటున్నారు.
 
భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు  పడిపోవడం,  చెట్ల కొమ్మలు విరిగి కరెంట్, ఇంటర్నెట్ వైర్ల మీద పడటంతో విద్యుత్ సరఫరాతో పాటు నెట్ వర్క్ ఉండటం లేదు.  చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సిగ్నల్స్ లేక విద్యార్థులు ఆన్ లైన్అ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులు సైతం ఇబ్బంది పడుతున్నారు.