హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం, మూసీకి రూ. 3,975 కోట్లు

హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం, మూసీకి రూ. 3,975 కోట్లు

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం చొప్పున ఖర్చు చేసే ప్రాతిపదికన ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్‌ ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం సహకరిస్తుందని, అమృత్‌ 2.O పథకం కింద రూ.3,975 కోట్లతో 39 ఎస్​టీపీలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

డిల్లీలో జరిగిన సమావేశంలో హైదరాబాద్‌లో ప్రజా రవాణా, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల ప్రాజెక్టులపై సమీక్షించినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్​ అండ్‌ టీ సంస్థ నుంచి మెట్రో రైల్‌ను ఇటీవలే టేకోవర్ చేసుకుంది. 

ఈ నేపథ్యంలో రెండో దశ పనులకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్​ (డీపీఆర్), ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.  

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని, సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని మనోహర్‌లాల్ ఖట్టర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన కోసం అమృత్ 2.O పథకంలో భాగంగా మూసీ నదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను (ఎస్​టీపీ)లను మంజూరు చేశామని, ఈ ప్రాజెక్టు కోసం రూ.3 వేల 975 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఖట్టర్‌ చెప్పారు. 

39 ఎస్​టీపీల ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం వస్తుందని తెలిపారు. శుద్ధి చేయని మురికి నీరు నేరుగా మూసీ నదిలో కలవకుండా ఎస్​టీపీలతో నిరోధించవచ్చని పేర్కొన్నారు. మూసీ నది పరిరక్షణతో పాటు నగర పారిశుద్ధ్య మెరుగుదలకు ఇది ఎంతో దోహదం చేస్తుందని ఖట్టర్ తెలిపారు.  హైదరాబాద్ మహానగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.