
హుజూరాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తుండడంతో సీఎం కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో పర్యటిస్తూ గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది అని ఎద్దేవా చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గం లోని ఇల్లందకుంటలో మాజీమంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న ‘ప్రజాదీవెన పాదయాత్ర’లో పాల్గొంటూ హుజూరాబాద్ లో గెలుపు బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వేల్లోనూ ఈటల రాజేందర్ కు రోజురోజుకూ ఓట్ల శాతం పెరుగుతోందని స్పష్టం చేశారు.
మొన్న 50 శాతంపైగా ఓట్లుంటే…ఇప్పుడు ఆ సంఖ్య 71 శాతం దాటిందని ఇంటెలిజెన్స్ సర్వే నివేదికలు రావడంతో కేసీఆర్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. అందుకే దళిత బంధు అంటూ మరో కొత్త డ్రామాకు కేసీఆర్ తెరదీసిండని ధ్వజమెత్తారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే అని విమర్శించారు.
“జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు ఇంటింటికీ రూ.10 వేలు ఇస్తానని హామీ ఇచ్చిండు. చివరకు నా లెటర్ ఫోర్జరీ చేసి ఆపించిండు. ఎన్నికలయ్యాక అందరికీ డబ్బులిస్తానని చెప్పి మోసం చేసిండు” అంటూ దుయ్యబట్టారు.
హుజూరాబాద్ ఎన్నికలు రావడంతో కేసీఆర్ మళ్లీ ‘దళిత బంధు’ అంటున్నడు. ఈ పథకం ద్వారా ఇంటికో రూ.10 లక్షలిస్తడట. ఇవన్నీ ఒట్టి మాటలే. పథకం స్టార్ట్ చేసి 10 మందికో 100 వంద మందికో మాత్రమే ఇస్తడు. తరువాత కోర్టులో పిటిషన్ వేయించి ఆపిస్తడు. బీజేపీవల్లే, ఈటల రాజేందర్ వల్లే పథకం ఆగిపోయిందని మళ్లీ అబద్దపు ప్రచారం చేయిస్తడని హెచ్చరించారు.
అయితే, కేసీఆర్ దళితులకు ప్రకటించిన పదిలక్షలు ప్రతి దళితుడికీ దక్కేదాకా బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. . ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా అర్హులైన అందరికీ ఇంటింటికీ రూ.10 లక్షలు ఇచ్చేదాకా బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేసీఆర్ ను, మంత్రులను అడుగడుగునా నిలదీస్తామని సంజయ్ స్పష్టం చేశారు.
దేశంలో అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆర్ అంటూ పాస్ పోర్టు బ్రోకర్. వేల కోట్ల రూపాయలు దండుకుని దుబాయ్, మస్కట్, అమెరికా, లండన్ వెళ్లి డబ్బులు దాచుకుని పెట్టుబడి పెడుతున్నరని ఆరోపించారు. “మేం అధికారంలోకి వచ్చాక అవన్నీ వెలికితీస్తం. ఆ డబ్బులన్నీ పేదల అకౌంట్లో వేస్తం. కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయం” అని సంజయ్ వెల్లడించారు.
ఈటల గెలిచిన తర్వాత నేరుగా అయోధ్యకు వెళతామని చెప్పారు. కేసీఆర్ సర్వేలను మాత్రమే నమ్ముకున్నాడని చెప్పారు. దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆరే నిలిపేసి, ఆ నెపాన్ని తమ పార్టీ మీదకు నెట్టేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లో తాము అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు.
More Stories
దశాబ్దం తర్వాత లెఫ్ట్ కంచుకోట జె ఎన్ యు లో ఎబివిపి పాగా!
రక్షణ మంత్రితో సిసిఎస్ అనిల్ చౌహన్ భేటీ!
కర్రెగుట్టల్లో మావోయిస్టుల భారీ సొరంగం బహిర్గతం