కాశ్మీర్ తుపాకీ లైసెన్స్ ల కుంభకోణంలో సిబిఐ సోదాలు

మోసపూరిత తుపాకీ లైసెన్స్ కేసుకు సంబంధించి శ్రీనగర్ మాజీ డిప్యూటీ కమిషనర్ (డిసి) షాహిద్ ఇక్బాల్ చౌదరి నివాసంతో సహా జమ్మూ కాశ్మీర్‌లోని 40 ప్రదేశాలలో సిబిఐ శనివారం సోదాలు నిర్వహించింది. ఈ కేసు 2012-16లో రాష్ట్ర అధికారులు బయటివారికి తుపాకీ లైసెన్సులను మోసపూరితంగా జారీ చేయడంకు సంబంధించింది. ఈ కేసులో సిబిఐ ఇంతకుముందు ఒక ఐఎఎస్ అధికారిని అరెస్టు చేసింది.

తమ సోదాలు జమ్మూ, శ్రీనగర్, ఉధంపూర్, రాజౌరి, అనంతనాగ్, బారాముల్లా, ఢిల్లీ అంతటా వ్యాపించాయని సిబిఐ తెలిపింది. సోదాలు జరిపిన ప్రాంగణంలలో అప్పటి ప్రభుత్వ అధికారులతో పాటు  (ఐఎఎస్, కెఎఎస్ అధికారులు, తరువాత జిల్లా మెజిస్ట్రేట్త, అదనపు మేజిస్ట్రేట్రు తదితరులు) నకిలీ తుపాకీ లైసెన్స్ లు పొందిన 20కు పైగా అధికార, నివాస  ప్రాంగణాలు ఉన్నాయి.

అర్హత లేని వ్యక్తులకు 2.78 లక్షలకు పైగా ఆయుధ లైసెన్సులు జారీ చేసినట్లు సిబిఐ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ లోని 22 జిల్లాల్లో విస్తరించి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయుధ లైసెన్సుల జారీకి సంబంధించిన పత్రాలను సేకరించినట్లు ఏజెన్సీ తెలిపింది.

“దర్యాప్తు,  పత్రాల పరిశీలనలో, కొంతమంది తుపాకీ డీలర్ల పాత్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుగుణంగా ఉంది.  సంబంధిత జిల్లాకు చెందిన అప్పటి మెజిస్ట్రేట్, అదనపు మెజిస్ట్రేట్ అనర్హమైన వ్యక్తులకు ఇటువంటి అక్రమ ఆయుధ లైసెన్సులను జారీ చేసినట్లు ఆరోపించారు. ఈ లైసెన్సులు పొందిన వ్యక్తులు ఆయుధ లైసెన్సులు జారీ చేసిన ప్రదేశాల నివాసితులు కాదని కూడా ఆరోపించబడింది, ”అని సిబిఐ ప్రకటన తెలిపింది.

ట్విట్టర్లో బహిరంగ ప్రకటనలో తన నివాసాన్ని సిబిఐ సోదా చేసిన్నట్లు షాహిద్ ఇక్బల్ చౌదరి ధృవీకరించారు, కాని అది “కొనసాగుతున్న ఆయుధ లైసెన్స్ దర్యాప్తులో లోపాలు ఏవీ కనుగొనలేదని” స్పష్టం చేశారు. అయితే, కొన్ని విధానపరమైన అవకతవకలు ఉండవచ్చని ఆయన అంగీకరించారు.


జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించి కేంద్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన  2019 ఆగస్టు 5  తరువాత నిర్ణయాలు తీసుకున్న కీలకమైన కాలంలో షాహిద్ చౌదరి శ్రీనగర్ పరిపాలనను నిర్వహించారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లోని గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శిగా, యుటి మిషన్ యూత్ ప్రోగ్రాం సిఇఒగా పనిచేస్తున్నారు.

మునుపటి రాష్ట్రంలో మోసపూరిత తుపాకీ లైసెన్స్ కేసులో తమ పాత్ర ఉందని ఆరోపిస్తూ 2020 మార్చిలో సిబిఐ ఒక ఐఎఎస్ అధికారిని, కాశ్మీర్ లోని  మాజీ డిప్యూటీ కమిషనర్‌ను అరెస్టు చేసింది. ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్, ఇత్రిత్ హుస్సేన్ రఫీకిలను వారు మోసపూరితంగా తుపాకీ లైసెన్సులు జారీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇద్దరూ ఈ కుంభకోణంపై కేంద్రమైన  కుప్వారా జిల్లా మాజీ జిల్లా అధికారులు.

2018 లో రాష్ట్ర పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన  తరువాత సిబిఐ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది.  2012-2016 మధ్య కాలంలో, కుప్వారాతో సహా జమ్మూకాశ్మీర్ లోని వివిధ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు “మోసపూరితంగా, చట్టవిరుద్ధంగా భారీ సంఖ్యలో ఆయుధాలకు లైసెన్సులు, తీసుకున్న నగదుకు బదులుగా జారీ చేశారు” అని ఎఫ్ఐఆర్ ఆరోపించింది.

“తాము జరిపిన తదుపరి దర్యాప్తులో, ఐఎఎస్ అధికారులైన ఇత్రిత్ హుస్సేన్ రఫీకి,  రాజీవ్ రంజన్ ఆ సమయంలో జిల్లా మెజిస్ట్రేట్ లుగా ఉన్నసమయంలో అనర్హులకు ఆయుధ లైసెన్సులు జారీచేయడంతో వారి పాత్ర వెల్లడైన్నట్లు  సిబిఐ తన ప్రకటనలు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల నుండి తమ డిసి / డిఎం ద్వారా సుమారు రెండు లక్షల ఆయుధాల లైసెన్స్‌లు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని సిబిఐ ప్రతినిధి అప్పుడు చెప్పారు. 

 
 “నిబంధనలను ఉల్లంఘిస్తూ జమ్మూకాశ్మీర్  నివాసితులు కానివారికి లైసెన్సుల జారీ చేసే కుట్రలో అప్పటి ప్రభుత్వ అధికారులు ముడుపులు సవీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి” అని సిబిఐ ప్రతినిధి ఒకరు ఆరోపించారు.”
 
రాజస్థాన్ ఎటిఎస్ అధికారుల కధనం ప్రకారం, జమ్మూ ప్రాంతంలోని దోడా, రాంబన్,  ఉధంపూర్ జిల్లాల్లోని 1,43,013 లైసెన్సులలో 1,32,321 రాష్ట్రం వెలుపల నివసిస్తున్న వారికి జారీ చేశారు. రాష్ట్రంలో జారీచేసిన మొత్తం  4,29,301 లైసెన్స్ లలో కేవలం 10 శాతం మాత్రమే రాష్ట్రంలోని నివాసితులకు జారీ చేశారు. ఉత్తర కాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా కుప్వారా నుండి జారీ చేసిన లైసెన్స్‌ల నమూనా సర్వేలో జిల్లా అధికారులు ఫైళ్లు లేదా రిజిస్టర్‌లు నిర్వహించలేదని, నకిలీ పత్రాల ఆధారంగా బయటి వ్యక్తులకు అనేక ఆయుధ లైసెన్సులు జారీ చేశారని వెల్లడైనది.