నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం వంచించింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం వంచించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ ఇచ్చింది నిరుద్యోగ యువతేనని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. 
 
ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీని విశ్వసించి ఓటేస్తే అధికారంలోకి రాగానే 10 వేల ఉద్యోగాలే ఇస్తామనడంతో యువత తాము మోసపోయామన్న ఆవేదనలో ఉన్నారని ధ్వజమెత్తారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండరుపై ఆందోళన చెందుతున్న నిరుద్యోగులకు జనసేన పార్టీ బాసటగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. 
 
ఈ మేరకు మంగళవారం అన్ని జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ అధికారి కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామని ఆయన తెలిపారు. పార్టీలో రాజకీయ నిరుద్యోగుల కోసం కొత్త పదవులు సృష్టించి ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పార్టీపై ఉన్న శ్రద్ధ, ఉద్యోగాల భర్తీపై ఎందుకు లేదని పవన్‌ కల్యాణ్‌  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు.