పాక్ లో ఆఫ్ఘన్ రాయబారి కుమార్తె అపహరణ

పాకిస్తాన్‌లోని ఆఫ్ఘనిస్తాన్‌ రాయబారి నజీబుల్లా అలీఖీల్ కుమార్తెను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హింసించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఈ అనైతిక సంఘటన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతను సృష్టించింది.
 
ఆఫ్ఘనిస్తాన్‌ రాయబారి నజీబుల్లా అలీఖీల్‌ కుమార్తె సిల్‌సిలా అలీఖీల్‌ (26) జిన్నా సూపర్‌ మార్కెట్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు యువకులు అడ్డుకుని కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెను దారుణంగా హింసించినట్లు సమాచారం. దుండగుల బారి నుంచి బయటపడి ఇంటికి వచ్చిన సిల్‌సిలాను స్థానిక దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆఫ్ఘాన్‌ ప్రభుత్వం పాకిస్తాన్‌లో తమ రాయబార కార్యాలయం అధికారులకు, వారి కుటుంబాలకు రక్షణ కొరవడిందని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆఫ్ఘాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ  ఒక ప్రకటన విడుదల చేసింది.
అంతర్జాతీయ ఒప్పందాలు, కట్టుబాట్లకు అనుగుణంగా, ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు, వారి కుటుంబాలకు పూర్తి భద్రతను కల్పించేందుకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. నేరస్థులను వీలైనంత త్వరగా గుర్తించి విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు.