పాక్ ప్రధాని వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన ఆర్ ఎస్ ఎస్

భారత్, పాక్ చర్చల విషయంలో ఆరెస్సెస్‌పై విమర్శలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సంఘ్ కౌంటర్ ఇచ్చింది. ఆరెస్సెస్ సీనియర్ నేత, ముస్లిం రాష్ట్రీయ మంచ్ అధ్యక్షుడు ఇంద్రేశ్ కుమార్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలను కవర్ చేసుకోడానికే సంఘ్‌పై ప్రధాని ఇమ్రాన్  విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
 
పాకిస్తానీ నాయకత్వం తీరు వల్లే 1947 లో దేశం రెండుగా చీలిపోయిందని, తాలిబాన్ ధోరణి వల్లే బంగ్లాదేశ్ ఏర్పడిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధ్, బలూచిస్తాన్ లాంటి ప్రాంతాలు తమ మనుగడ కోసం ఇప్పటికీ సంఘర్షణ పడుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. పాకిస్తాన్ ఆవిర్భావమే విషంజిమ్మే స్వభావంతో జరిగిందని, అందుకు సాక్ష్యం ప్రధాని ఇమ్రాన్ మాటలేనని తీవ్రంగా ధ్వజమెత్తారు. 
 
శాంతియుతంగా జీవించాలని పాక్ ప్రజలు కోరుకుంటే, పాకిస్తాన్ పాలకులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటారని ఇంద్రేశ్ మండిపడ్డారు. పాక్ భావజాలం ఉన్న వారు భారతీయులను విడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని, సోదరత్వానికి, మానవత్వానికి వారు వ్యతిరేకులని ఆయన దుయ్యబట్టారు. 
 
ఇందులో భాగంగానే ఆరెస్సెస్‌పై ఇమ్రాన్ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ స్వభావం తాలిబాన్ స్వభావమని, శాంతికి దూరంగా ఉంటూ, విడిపోయే స్వభావానికి దగ్గరగా పాక్ వ్యవహార శైలి ఉంటుందని ఇంద్రేశ్ కుమార్ నిప్పులు చెరిగారు. 
 
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలుత శుక్రవారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, అయితే ఆరెస్సెస్ భావజాలమే అందుకు అవరోధంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘‘పొరుగు దేశమైన భారత్‌తో సఖ్యతగా ఉండడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ.. ఏం చేయాలి? మధ్యలో ఆరెస్సెస్ భావజాలం వచ్చి చేరింది’’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
ఇమ్రాన్ ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ వెంటనే తిప్పికొట్టారు. ఆరెస్సెస్ ఎప్పుడూ సామరస్యాన్నే బోధిస్తుందని పేర్కొన్నారు. తీవ్రవాద మూలాలు పాక్‌లోనే ఉన్నాయని, ఈ విషయం ప్రధాని ఇమ్రాన్‌కు బాగా తెలుసని చురకలంటించారు. సంఘ్‌ను విమర్శించి లాభం లేదని, అదో అర్థంపర్థంలేని వ్యాఖ్య అని కౌశల్ కిశోర్ మండిపడ్డారు.