భారత్ నిర్మాణాలే తాలిబన్ల లక్ష్యం..  ఐఎస్ఐ వ్యూహం 

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో గ‌త 20 ఏళ్లుగా భార‌త్ నిర్మించిన భ‌వ‌నాలు, మౌలిక వ‌స‌తులే ల‌క్ష్యంగా దాడి చేయండంటూ అక్క‌డి తాలిబ‌న్లు, పాకిస్థాన్ ఫైట‌ర్ల‌కు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సూచించింది. ఆప్ఘ‌నిస్థాన్‌లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న తాలిబ‌న్ల‌కు మ‌ద్ద‌తు ఇప్ప‌టికే చాలా మంది పాకిస్థాన్ ఫైట‌ర్లు వాళ్ల‌తో చేతులు క‌లిపారు. 
 
వాళ్లంద‌రికీ ఇప్పుడు భార‌త ఆస్తులే ల‌క్ష్యంగా దాడులు చేయాల‌న్న ఆదేశాలు అందాయి అని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. తాలిబ‌న్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని భార‌త ఆస్తులే ల‌క్ష్యంగా దాడులు జ‌ర‌గ‌బోతున్న‌ట్లు ఆ వ‌ర్గాలు తెలిపాయి.
 
పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘ‌నిస్థాన్‌లోకి సుమారు 10 వేల మంది ఫైట‌ర్లు చొర‌బ‌డిన‌ట్లు స‌మాచారం. వీళ్ల‌లో కొంతమంది ఎప్ప‌టి నుంచో ఆఫ్ఘ‌నిస్థాన్‌లోనే ఉంటూ.. అమెరికా ద‌ళాల‌కు వ్య‌తిరేకంగా ఫైట్ చేశారు. 2001లో ఆఫ్ఘ‌నిస్థాన్‌పై తాలిబ‌న్లు ప‌ట్టు కోల్పోయిన‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త్ ఆ దేశంలో 300 కోట్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేసింది. 
 
జారంజ్‌, డెలారామ్ మ‌ధ్య ఉన్న 218 కి.మీ. రోడ్డు, ఇండియాఆఫ్ఘ‌నిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ (సల్మా డ్యామ్‌), ఆఫ్ఘ‌న్ పార్ల‌మెంట్ బిల్డింగ్‌లాంటివి ఇండియా అక్క‌డ నిర్మించింది. తాలిబ‌న్లు తిరిగి రావ‌డంతో ఆ దేశంలో భారత్ ఉనికి  కొన‌సాగుతుందా లేదా అన్న‌ది ప్ర‌శ్నార్థకంగా మారింది. 
 
దీనిపై తాలిబ‌న్ల నుంచి ఎలాంటి హామీ ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త ప్ర‌భుత్వానికి రాలేదు. ఇప్ప‌టికే అక్క‌డ ప‌ని చేస్తున్న భార‌త వ‌ర్క‌ర్ల‌ను దేశం వ‌దిలి వచ్చేయాల్సిందిగా భార‌త ప్ర‌భుత్వం సూచించింది.
 
పాక్ నుండి 10 వేల మంది జిహదీలు 
 
ఇలా  ఉండగా, పాకిస్తాన్‌ తమ దేశంలోకి పది వేల మంది జిహదీలను పంపించిందని  ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  అంతటితో ఆగకుండా పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఆ దేశ మిలటరీ జనరల్‌ ఇద్దరూ తాలిబాన్‌ పక్షాన ఉన్నారని మండిపడ్డారు.
 
తాష్కెంట్‌లో సెంట్రల్‌, సౌత్‌ ఏసియా కాంటాక్ట్‌ కాన్ఫరెన్స్‌లో అష్రాఫ్‌ ఘనీ ఈ ఆరోపణలు చేస్తున్న సమయంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆయనకు ఎదురుగానే కూర్చున్నారు. ఈ చర్చ అనంతరం శాంతి సమావేశం వాయిదా పడింది.
 
‘గత నెలలో తమ దేశంలోని పాకిస్తాన్‌ 10 వేల మంది జిహదీలను పంపింది. దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్‌ నివేదికలు మా వద్ద ఉన్నాయి. పాకిస్తాన్‌ ఇప్పటికే ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలను తెంచుకోలేదు’ అని అష్రాఫ్‌ ఘనీ ఆరోపించారు. శాంతి చర్చలకు తాలిబాన్లు వచ్చేలా చేయడంలో పాకిస్తాన్‌ చొరవచూపడం లేదని కూడా ధ్వజమెత్తారు. 
 
ఇమ్రాన్‌ఖాన్‌, పాక్‌ మిలటరీ జనరల్‌ తాలిబాన్లను వెనకేసుకు రావడం వల్ల తమ దేశంలో తాలిబాన్లు రెచ్చిపోతున్నారని, ప్రభుత్వం, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉత్సవాలు చేసుకుంటున్నారని ఘనీ ఆరోపించారు. ఇలాఉండగా, ఆఫ్ఘనిస్తాన్‌లో మూడు జిల్లాల్లో పాగా వేసిన తాలిబాన్లను అక్కడి నుంచి సైన్యం తరిమివేసిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.సైఘన్, కహ్మార్డ్, చఖన్‌సూర్ జిల్లాలను ఆఫ్ఘన్ భద్రతా దళాలు తాలిబాన్ ఆక్రమణ నుండి విడిపించాయని వెల్లడించింది.