ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పాక్ కోనసాగేలా చేసిన భారత్

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో పాకిస్థాన్‌ కొనసాగేలా చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విజయం సాధించిందని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చెప్పారు. ఇరుగు పొరుగు దేశాలతో సామరస్యంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తూనే, ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమస్యగా పరిగణించేలా చేసినట్లు తెలిపారు. ఇది కొన్ని దేశాల సమస్య కాదని గుర్తించేలా చేసినట్లు పేర్కొన్నారు. 

మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై బీజేపీ నేతలకు శిక్షణ కార్యక్రమంలో వర్చువల్ పద్ధతిలో జైశంకర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలపై మోదీ ప్రభుత్వ కృషి వల్ల జైషే మహమ్మద్, లష్కరే తొయిబా ఉగ్రవాదులపై ఆంక్షల విధింపు సాధ్యమైందని చెప్పారు. ఇరుగు పొరుగు దేశాలతో సుహృద్భావ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం కోసం మోదీ నాయకత్వంలో కృషి జరుగుతోందని తెలిపారు.

ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్యగా గుర్తింపు పొందే విధంగా జీ7, జీ20 వంటి అంతర్జాతీయ సదస్సుల ద్వారా మోదీ కృషి చేసినట్లు వెల్లడించారు. ఉగ్రవాదులకు నిధులు చేరడం, ఉగ్రవాదానికి మద్దతుగా జరిగే నల్లధనం లావాదేవీలు వంటివాటిపై ఎఫ్ఏటీఎఫ్ నిఘా పెడుతుందని చెప్పారు.

మన కారణంగానే పాకిస్థాన్ ఎఫ్ఏటీఎఫ్ నిఘా నేత్రం పరిధిలోకి వచ్చిందని,  పాకిస్థాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పెట్టిందని జైశంకర్ స్పష్టం చేశారు.  పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచడంలో మనం విజయం సాధించామని తెలిపారు. వివిధ చర్యల ద్వారా భారత దేశం ఒత్తిడి చేయడం వల్లనే పాకిస్థాన్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు.

లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులపై ఆంక్షలు విధించడానికి కారణం భారత దేశం ఐక్య రాజ్య సమితి ద్వారా తీసుకొచ్చిన ఒత్తిడేనని చెప్పారు. జీ7, జీ20 వంటి వేదికల ద్వారా మోదీ వ్యక్తిగతంగా చేసిన కృషి వల్ల ఉగ్రవాదం అనేది ప్రతి ఒక్కరి సమస్య అని ప్రపంచ దేశాలు గుర్తించాయని చెప్పారు.

డోక్లాం, లడఖ్‌లలో చైనా సవాళ్లు విసిరిందని, డోక్లాం నుంచి చైనా వెనుదిరిగిందని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి వేధిస్తున్న సమయంలో లడఖ్‌లో వాస్తవాధీన రేఖను అతిక్రమించడానికి చైనా ప్రయత్నించిందని చెప్పారు. దీనికి భారత్ దీటైన జవాబు ఇచ్చిందని చెబుతూ రక్షణ మంత్రిత్వ శాఖ సమన్వయంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. చైనా ఒత్తిళ్ళకు భారత్ తలొగ్గబోదని ఇప్పుడు ప్రపంచానికి తెలిసిందని గుర్తు చేశారు.