అమరిందర్ కు చెక్… పంజాబ్ కాంగ్రెస్ అధినేతగా సిద్దు!

ఒక వంక పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కు మద్దతుగా పంజాబ్ లోని కాంగ్రెస్ ఎంపీలు, పలువురు ఎంపీలు సమీకృతం అవుతూ, నవజ్యోత్ సింగ్ సిద్దును ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించవద్దని డిమాండ్ చేస్తుండగా, కాంగ్రెస్ అధిష్టానం అకస్మాత్తుగా ఆదివారం రాత్రి సిద్దును నూతన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ప్రకటించింది. 

దానితో, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో కాంగ్రెస్ కు గెలుపు పట్ల ధీమాగాల ఏకైక రాష్ట్రమైన పంజాబ్ లో ఇప్పుడు ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలు పరాకాష్టకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

చివరకు కనీసం తన ప్రభుత్వంకు వ్యతిరేకంగా కొంతకాలంగా విమర్శలు చేస్తున్న సిద్దు చేత బహిరంగంగా కాశమాపణలు అయినా చెప్పించాలని అమరిందర్ కోరినా కాంగ్రెస్ అధిష్ఠానం ఖాతరు చేయలేదు. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించి విషయంలో కూడా ముఖ్యమంత్రి సిఫార్సులను పట్టించుకోలేదు. 

రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆదివారమే పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలసి ప్రస్తుత పరిస్థితులలో సిద్దు నియామకం పార్టీకి అరిష్టంగా మారగలదని హెచ్చరించినా పట్టించుకొనక పోవడం గమనార్హం. ఒక దశలో అమరిందర్ సింగ్ పట్ల సోనియా గాంధీ సానుభూతిగా ఉన్నట్లు కనిపించినా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రం సిద్దు వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. 

వాస్తవానికి సోమావారం పార్టీ ఎంపీలు, ఎమ్యెల్యేలతో ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జక్కర్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమకు ఆమోదయోగ్యమంటూ తీర్మానం చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఆ తర్వాతనే సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకోగలరని అందరు భావించారు. 

కానీ అకస్మాత్తుగా ఆదివారం రాత్రి సిద్దును ప్రకటించడంతో ఈ సమావేశాన్ని ఇప్పుడు రద్దు చేశారు. సిద్దు గత రెండు రోజులుగా రాష్ట్రంలో 40 మందికి పైగా పార్టీ నేతలను కలిసి మద్దతు కూడదీసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. అమరిందర్ సింగ్ కు కంచుకోటగా భావించే పాటియాలలో సహితం ఇద్దరు ఎమ్యెల్యేలను కలిశారు. 

బిజెపి ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన క్రికెటర్ సిద్దు మూడు పర్యాయాలు ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. అయితే 2014 ఎన్నికలలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అమృతసర్ సీట్ నుండి అరుణ్ జైట్లీ పోటీ చేసి, ఆయనకు సీట్ నిరాకరించడంతో అసంతృప్తితో ఉంటూ వచ్చారు. ఆ తర్వాత 2017లో అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ద్వారా కాంగ్రెస్ లో ప్రవేశించారు. 

రాహుల్ గాంధీ మద్దతు ఉన్నప్పటికీ గత ఐదేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో చెప్పుకోదగిన ప్రాధాన్యత లభించక పోవడంతో అసంతృప్తిగా ఉన్న సిద్దు ఒక దశలో ఆప్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కూడా కధనాలు వెలువడ్డాయి. కాబోయే ముఖ్యమంత్రిగా ఉహించుకొంటూ వస్తున్న సిద్ధుకు అమరిందర్ చెక్ పెడుతూ వస్తున్నారు. 

సిద్దును కాంగ్రెస్‌ లోకి తీసుకురావడంలో కీలకపాత్ర వహించిన వారిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒకరు. అయితే ఆయన  ఇప్పుడు అమరీందర్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 2019లో సిద్దు మంత్రిత్వ శాఖలలో స్థానిక సంస్థల శాఖను అమరిందర్ తొలగించడంతో నిరసనగా మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. గత ఏప్రిల్ నుండి ట్విట్టర్ వేదికగా అమరిందర్ పై బహిరంగంగా దాడి చేస్తూ వస్తున్నారు.

సిద్దు విమర్శల పట్ల మౌనంగా ఉంటూ వస్తున్న అమరిందర్ వర్గంకు మద్దతుగా మొదటిసారిగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా ఆదివారం నాడు కెప్టెన్‌నే వెన‌కేసుకొచ్చారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అమ‌రీంద‌ర్‌ను సీఎంగా తొల‌గించ‌కూడ‌ద‌ని, ఇప్ప‌టికీ అత్యంత జ‌నాద‌ర‌ణ ఉన్న నేత ఆయ‌నే అని వాళ్లు కాంగ్రెస్ హైక‌మాండ్‌కు స్పష్టం చేశారు.

పిసిసి అధ్యక్షుని ఎంపికలలో అమరీందర్ సింగ్ మాటను కాదని పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని వారు హెచ్చరించారు. 1984 త‌ర్వాత కాంగ్రెస్‌లో ఇప్పుడు మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిందంటే దానికి కార‌ణం అమ‌రీంద‌రే అని గుర్తు చేశారు. పంజాబ్ పీసీసీ చీఫ్ ప‌ద‌విని సిద్ధూకి ఇవ్వ‌కూడ‌ద‌ని స్పష్టం చేశారు.