పార్లమెంటులో లేవనెత్తే ప్రతి అంశంపైనా అర్ధవంతమైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అఖిల పక్ష సమావేశంలో స్పష్టం చేశారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని ప్రధాని మోదీ ఆదివారంనాడు ఏర్పాటు చేశారు.
33 పార్టీలకు చెందిన 40 మందికి పైగా నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను మీడియాకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. పార్లమెంటులో ఆరోగ్యకరమైన, అర్ధవంతమైన చర్చలు జరుపుదామని, పార్లమెంటరీ నియమ నిబంధనలకు అనుగుణంగా సభలో ప్రస్తావించే ప్రతి అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నట్టు చెప్పారు.
ఏయే అంశాలు చర్చించాలనే విషయమై సమావేశంలో పాల్గొన్న నేతలు సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. విపక్ష పార్టీల నుంచి హాజరైన నేతలు సహా ప్రతి ఒక్కరు సూచనలు తమకెంతో విలువైనవని సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని పేర్కొన్నట్టు చెప్పారు.
కాగా, సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి, రాజ్యసభ పక్ష నేత పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మాత్యులు ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ హాజరయ్యారు.
పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం సంప్రదాయం. పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ఆగస్ట్ 13 వరకు కొనసాగనుండగా, 19 రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తొలిసారిగా పార్లమెంట్ సమావేశమవుతోంది.
ఈ సారి సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పెరుగుదల, కరోనా మహమ్మారి, వ్యాక్సిన్ల కొరత, విదేశాంగ విధానం, రాఫెల్ ఒప్పందం తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో పార్లమెంట్ కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. సభ్యులందరూ టీకాలు తీసుకోవాలని కోరారు. కాగా, లోక్‌సభ సచివాలయం ప్రకారం 231 మంది సభ్యులున్న రాజ్యసభలో 200 మంది ఎంపీలు రెండు మోతాదుల టీకా పొందారు. 16 మంది మొదటి మోతాదు వేసుకోగా, లోక్‌సభలో 540 మంది ఎంపీల్లో 470 మంది కనీసం ఒక డోసు తీసుకున్నారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే