పల్లెల్లో సుపరిపాలన జరగాలి… వెంకయ్యనాయుడు ఆంకాక్ష!

గ్రామరాజ్యం లేని రామ రాజ్యం అసంపూర్ణం అన్న మహాత్మాగాంధీ మాటల స్ఫూర్తితో  గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సాధికారత, స్వావలంబనతోపాటు పల్లెల్లో సుపరిపాలన జరగాలనేది తన ఆకాంక్ష అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. 

మాజీ పార్లమెంట్ సభ్యుడు యలమంచిలి శివాజీ రచించిన ‘పల్లెకు పట్టాభిషేకం’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ గ్రామీణం, వ్యవసాయం రెండూ పరస్పర ఆధారితమైన అంశాలని, ఒకదాన్నుంచి మరొకదాన్ని వేరుచేసి చూడలేమని స్పష్టం చేశారు. 

అందుకే గ్రామాలకు పునర్వైభవం తీసుకురావడానికి విస్తృతమైన కృషి జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమ చిన్నతనంలో పల్లెలకు, పట్టణాలకు అంత అంతరం ఉండేది కాదని, కానీ క్రమంగా పరిస్థితులో మార్పు వచ్చి, గ్రామాలను పట్టణాలకు ఆహారాన్ని అందించే కర్మాగారాలుగానే చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితి మారి పల్లెల గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఏదైనా పండుగ వచ్చినప్పుడు గ్రామాలకు తరలివెళ్ళి అక్కడి సమస్యలు తెలుసుకుని, సాధ్యమైనంతమేర వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం తన గమ్యాన్ని తానే నిర్దేశించుకోగల స్థాయిలో ఉండాలని చెప్పారు. .

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాల కారణంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగం పుంజుకుంటోందని  చెబుతూఅయితే ఈ పక్రియ మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మహత్కార్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధలకులతోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు.

అప్పుడే గ్రామస్వరాజ్య స్వప్నం వేగంగా సాకారం అవుతుందని చెబుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి సింహభాగమని పేర్కొన్నారు. లోకమంతా తిండి తినేందుకు అన్నదాత ఆరుగాలం శ్రమిస్తాడని, అందుకే అమ్మ తర్వాత అంత గొప్ప మనసున్నది అన్నదాతేనని తాను తరచుగా చెబుతూ ఉంటానని గుర్తుచేశారు.

కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభించిపోయినా, భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి రెట్టింపయిన విషయాన్ని గుర్తుచేశారు. కోవిడ్ విసురుతున్న సవాళ్ళలో భాగంగా రాబోయే రోజుల్లో తీవ్ర ఆహారం సంక్షోభం రానుందన్న ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ (ఎఫ్‌ఎఒ) ప్రకటనను ఉటంకించారు. ఈ  నేపథ్యంలో అన్ని వేళలా శ్రమించేందుకు సిద్ధంగా ఉండే అన్నదాతలకు మనం సకాలంలో చేయూతను అందించగలిగితే, మన ఆహార అవసరాలను తీర్చుకోవడంతోపాటుగా ప్రపంచం ఆకలి తీర్చేందుకు కూడా భారతదేశం ముందుకు రాగలదని వెంకయ్య నాయుడు చెప్పారు.

ఇందుకోసం రైతులు పండించే ఉత్పత్తులకు మంచి ధరను అందించటంతోపాటు సకాలంలో, సరసమైన విధంగా రుణాలు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పంటల రవాణాపై ఆంక్షలు తొలగించి గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు నిల్వసామర్థ్యం, శీతల గిడ్డంగుల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని సూచించారు.

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 శాతం మేర ఎగుమతులు పెరగడం అభినందనీయమని తెలిపారు. ఎగుమతులు పెరగడం వల్ల రైతుకు లాభసాటి మాత్రమే గాక, విదేశీమారకద్రవ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులను అదుపు చేసుకుని, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. . సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగినందున దీనిపైనా కూడా దృష్టిసారించాలని సూచించారు.  నీటిఎద్దడిని తట్టుకుని పెరిగే పంటల దిశగా ఆలోచన చేయాలని సూచించారు.

రైతులు పూర్తిగా వ్యవసాయంపైనే కాకుండా, అనుబంధ రంగాలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. పశుపోషణ, పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకలు, కోళ్ళు, చేపలు, రొయ్యల పెంపకం ద్వారా వ్యవసాయంలో ఒకవేళ నష్టం వచ్చినా వీటి ద్వారా పూరించుకోవచ్చని చెప్పారు.

వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ముందు యువత ఈ రంగం దిశగా దృష్టి కేంద్రీకరించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. నిజాయితీగా కష్టపడే చదువుకున్న యువకులు గ్రామాలకు తరలి, తెలివితేటల్ని ఉపయోగిస్తే మన భూములు మళ్లీ బంగారు మాగాణులవ్వడం ఖాయమని పేర్కొన్నారు. 

వ్యవసాయ పరిశోధనల ఫలితాలు నేరుగా పొలాలకు చేరాలన్న ఆయన, వాతావరణ మార్పులతో పాటు ఇతర ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని అప్పుడే రైతులకు అసలైన లాభం ఉంటుందని తెలిపారు.  

వ్యవసాయరంగ అభివృద్ధిలో మీడియా పాత్ర కూడా కీలకమన్న ఉపరాష్ట్రపతి, కొన్ని పత్రికలు, ఛానళ్ళు మాత్రమే రైతు కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నాయని ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, కనీసం పత్రికల్లో ఓ పేజీ, ఛానళ్లలో ఓ అరగంట కేటాయించాలని సూచించారు. 

కాగా, పుస్తక రచయిత యలమంచిలి శివాజీని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అభినందించారు. వారి కలం నుంచి జాలువారిన వ్యాసాల సంకలనాన్ని చక్కటి శీర్షికతో తీసుకురావడాన్ని ఆయన ప్రశంసించారు. గ్రామీణ భారతం ఎదుర్కొంటున్న సవాళ్లను, ప్రత్యేకించి వ్యవసాయరంగంలో ఎదురవుతున్న సమస్యలను ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారని తెలిపారు.