కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ…. తెలంగాణలో దుమారం!

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశించి, ఆ పదవి రాకపోగా పార్టీలో తనకన్నా జూనియర్, టిడిపి నుండి వచ్చిన రేవంత్ రెడ్డిని ఆ పదవి వారించడంతో భగ్గుమంటున్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో భేటీ కావడం తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపుతున్నది. 

కేవలం కాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డిని అభినందించి, తెలంగాణ వారసత్వ సంపదగా భావించే భువనగిరి కోట అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేసేందుకు కలిసిన్నట్లు చెబుతున్నా ఎవ్వరు విశ్వసించడం లేదు. ఇదివరకే కిషన్ రెడ్డికి ఆయన మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. 

మరోవంక, ఇప్పటి వరకు ఆయన రేవంత్ రెడ్డికి అభినందనలు తెలపడం గాని, ఆయన పదవీ స్వీకారంకు హాజరు కావడం గాని కోమటిరెడ్డి చేయలేదు. మరోవంక, ఇక నుంచి తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనని ప్రకటించారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తానని ప్రకటించారు. పిసిసి నుండి తనతో మాట్లాడే ప్రయత్నం ఎవ్వరు చేయవద్దని కూడా స్పష్టం చేశారు. 

చాలాకాలంగా కాంగ్రెస్ లో అసమ్మతివాదిగా పేరొందిన కోమటిరెడ్డి కొన్ని సంవత్సరాలుగా బిజెపి నేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొంటూ ఆ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదని సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. అయితే పిసిసి నాయకత్వం లభిస్తుందనే ఆశతోనే ఇప్పటివరకు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. 

కిషన్ రెడ్డిని కలవడానికి ముందు రోజున ఆయన ఢిల్లీలో శనివారం సైతం ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయని కూడా కలిశారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలు సహితం కిషన్ రెడ్డితో  చర్చించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

తెలంగాణ కాంగ్రెస్ ను నడిపించే సమర్థవంతమైన నాయకుడు లేడని కిషన్ రెడ్డిని కలసిన అనంతరం  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొనడం గమనార్హం. అయితే, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదని తెలిపారు. అదే సమయంలో నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన హితవు చెప్పారు 

బీజేపీలో చేరతానని సంకేతం ఇవ్వడం ద్వారా ఏఐసీసీలో కీలక పదవి కోసం కాంగ్రెస్ అధిష్ఠానంపై వత్తిడి తీసుకు రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా ఇక కాంగ్రెస్ లో తనకు రాజకీయ భవిష్యత్ లేదని తెలుస్తుకొని బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారా? అని రాజకీయ వర్గాలలో ఆసక్తి చెలరేగుతున్నది. 

ప్రస్తుతం లోక్ సభ సభ్యుడు కావడంతో ఆ పదవికి రాజీనామా చేస్తేగాని బీజేపీలో చేరే అవకాశం లేదు. అందుకనే వెంటనే బీజేపీలో చేరే అవకాశాలు లేకపోవచ్చని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. అయితే బీజేపీలోని మాజీ కాంగ్రెస్ నేతలైన మాజీ మంత్రి డీకే అరుణ వంటి వారు ఆయనను బీజేపీలో చేరమని కొంతకాలంగా ప్రోత్సహిస్తున్నారు. 

ఇప్పటి వరకు కోమటిరెడ్డి అసమ్మతి వ్యవహారంపై రేవంత్ రెడ్డి గాని, ఏఐసీసీ నాయకులు గాని ఎవ్వరు స్పందించలేదు. వారు ఆయన ధోరణిని గమనిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇటువంటి సమయంలో కోమటిరెడ్డి రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో అన్న ఆసక్తి కలుగుతున్నది.