భారత్ లో రెండంకెల ఆర్థిక వృద్ధి రేటు

దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల ఆర్థిక వృద్ధి రేటును నమోదుచేస్తుందని నీతి ఆయోగ్‌ వైస్ చైర్మన్ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ వాతావరణం కూడా మెరుగ్గా కనిపిస్తోందని చెప్పారు. కరోనా మహమ్మారి థర్డ్ వచ్చినా తట్టుకునే సామర్థం భారత్‌కు ఉందని భరోసా వ్యక్తం చేశారు.

గతంలో వచ్చిన కరోనా వేవ్స్ నుంచి రాష్ట్రాలు పాఠాలు నేర్చుకున్నాయని, కొవిడ్ మూడో దశ వస్తే దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని ఒక ఇంటర్వూలో కుమార్ స్పష్టం చేశారు. కొవిడ్19 మహమ్మారిని అధిగమిస్తామని, ఈ సంవత్సరం రెండో భాగంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు బలోపేతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. 

భారత్ ఆర్థిక వ్యవస్థ వేగవంతం అవుతుందనడానికి ఇటీవల వెల్లడించిన పలు సంకేతాలు, గణాంకాలే ఉదాహరణ అని తెలిపారు. వాస్తవానికి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని, అయితే కోలుకుంటున్న దశలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో మందగమనం మొదలైందని కుమార్ గుర్తు చేశారు. 

అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంటూ ఇటీవల పలు ఏజెన్సీలు, సంస్థలు భారత్ జిడిపి అంచనాలను డౌన్‌గ్రేడ్ నుంచి అప్‌గ్రేడ్ సవరిస్తున్నాయని తెలిపారు. భారత్ కోలుకుంటుందనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పా రు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు రెండంకెలకు చేరుకుంటుంది’ అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

2021 మార్చి ముగింపు నాటికి దేశీయ జిడిపి మైనస్ 7.3 శాతానికి పడిపోయింది. రేటింగ్ ఏజెన్సీలను పరిశీలిస్తే, ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ భారత్ జిడిపి అంచనాను 11 శాతం నుంచి 9.5 శాతానికి సవరించింది. అదే సమయంలో ఫిచ్ రేటింగ్స్ కూడా గతంలో ఇచ్చిన 12.8 శాతం జిడిపి అంచనాను 10 శాతానికి తగ్గించింది. 

ఈ సంస్థలు జిడిపి అంచనాల్లో కోత పెట్టడానికి కారణం కరో నా సెకండ్ వేవ్ పెరగడమే. కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే సంకేతాలతో ఆర్‌బిఐ 2022 మార్చి 31 ముగింపు నాటి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిడిపి అంచనా 9.5 శాతానికి పెంచింది.

ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయని కుమార్ తెలిపారు. స్టీలు, సిమెంట్, రియల్ ఎస్టేట్ వంటి కొన్ని రంగాల్లో విస్తరణ కోసం పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. కన్జూమర్ డ్యూరబుల్ సెక్టార్‌లో కరోనా అనిశ్చితి కారణంగా వినియోగదారులు సంకోచించవచ్చు. పూర్తి స్థాయిలో ప్రైవేటు పెట్టుబడులు ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనా వేస్తున్నామని వివరించారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందని నీతి ఆయోగ్ చైర్మన్ రాజీవ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కొవిడ్ సెకండ్ వేవ్ ఉన్నా, ఆరోగ్య రంగం దెబ్బతినప్పటికీ మార్కెట్లు ఇప్పటికీ సానూకూలంగా ఉన్నాయని, సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని చెప్పారు. ఎఫ్‌డిఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) విషయంలో భారత్ ఇప్పటికీ మెరుగ్గా ఉందని, 2020-21, అలాగే 2021-22 ఏప్రిల్ జూన్ కాలంలో ఎఫ్‌డిఐ కొత్త రికార్డులను సృష్టించిందని గుర్తు చేశారు. 

స్టార్టప్‌ల ఐపిఒల సంఖ్య పెరగడంపై ఆయన స్పందిస్తూ, పెట్టుబడుల ఉపసంహరణ వాతావరణం మెరుగవుతోందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వరంగ కంపెనీలు, ఆర్థిక సంస్థల్లో వాటాల విక్రయం నుంచి రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని బడ్జెట్ లక్షంగా చేసుకుంది. ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితులతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఆర్థికంగా ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. 

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిని 9.5 శాతంగా నమోదు చేసిందని, దీంతో ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోనుందన్న సూచనను అందించిందని రాజీవ్ కుమార్ తెలిపారు.