ట్విట్టర్ ప్రత్యర్థి `కూ’ లో ఆర్ ఎస్ ఎస్ ఖాతా!

భారతీయ భాషల్లోని వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకు రాష్ట్రీయ  స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తమ ప్లాట్‌ఫామ్‌లో చేరిందని అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్ వేదిక ట్విట్టర్ ప్రత్యర్థి, భారతీయ మైక్రో బ్లాగింగ్ వేదిక కూ తెలిపింది.  
 
నూతన ఐటి నిబంధనలతో సహా వివిధ అంశాలపై భారత ప్రభుత్వంతో ట్విట్టర్ తరచూ ఘర్షణ వైఖరి ఆవలంభిస్తున్న దృష్ట్యా అధికార పార్టీ నాయకులు, ఇతరులు ఇప్పుడు కూ పట్ల ఆసక్తి చూపుతున్నారు. దాని వేదికపై కమ్యూనిటీలు పెరుగుతున్నాయని, రాజకీయాలు, క్రీడలు,  వినోదం వంటి రంగాల నుండి పెద్ద సంఖ్యలో ప్రముఖులు ఈ సైట్‌లోకి ప్రవేశించారని కూ వెల్లడించింది. 
 
ఈ వేదికపై కొత్తగా చేరిన ప్రముఖ సంస్థలలో రాష్ట్రీయ  స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఒకటి. ఇది బుధవారం, భారత మైక్రో-బ్లాగింగ్,  సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం అయిన కూ, ప్రజలతో @RSSOrg హ్యాండిల్‌ను ఉపయోగించడం ప్రారంభించింది.
“50 లక్షల మందికి పైగా సభ్యులతో గల ఆర్ఎస్ఎస్ భారతీయ సమాజంలోని వివిధ రంగాలలో కీలక పాత్ర వహిస్తున్న పలు సంస్థలకు స్ఫూర్తి కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ”  అని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టాక్సీఫోర్సూర్ వ్యవస్థాపకుడు, సీరియల్ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ, గతంలో  మీడియాఆంట్,  గుడ్‌బాక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసిన మయాంక్ బిదావత్కా కలసి స్థాపించిన కూ ఇప్పుడు 6.5 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. 
 
“భారతీయ ప్లాట్‌ఫామ్‌లో తయారైన కూ, సంస్థలకు స్థానిక ప్రాంతాలను బలోపేతం చేయడానికి, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని కమ్యూనిటీలతో కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ అధికారిక ప్రతినిధి రాజీవ్ తులి కూడా కూలో చేరారు” అని ఆ కంపెనీ తెలిపింది.
ట్విట్టర్ కు ప్రత్యామ్న్యాయ వేదికగా, `భారత్ లో తయారు’ వేదికగా ప్రచారం చేసుకొంటున్న కూ  బిజెపి మద్దతు దారులతో పాటు ట్విట్టర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న అనేకమంది భారతీయులు ఆదరిస్తున్నారు. 
 
గత నెల భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో పాటు ఆర్ ఎస్ ఎస్ అధినేత డా. మోహన్ భాగవత్, పలువురు ఆర్ ఎస్ ఎస్ నేతల  ట్విట్టర్ ఖాతాలపై `బ్లూ బ్యాడ్జ్’ను తొలగించడంతో   వివాదం ఏర్పడింది. ఈ అవకాశాన్ని కూ తన విస్తరణకు బాగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తున్నది. 
 
ఇదే సమయంలో నైజీరియా ప్రభుత్వం ట్విట్టర్ ను అధికారికంగా నిషేధించినప్పుడు కూ ఆ దేశ ప్రభుత్వమును సంప్రదించి, తమ సేవలు స్థానిక భాషలో అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ ప్రభుత్వం అంగీకరించడంతో భారత్ వెలుపల కూ ప్రవేశించిన మొదటి దేశంగా నైజీరియా మారింది.