అవినీతి, ఆత్మవంచనలో జగన్, కేసీఆర్ తోడుదొంగలు 

అవినీతి, ఆత్మవంచన చేయడంలో ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ తోడు దొంగలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దుయ్యబట్టారు. బూటకపు వాగ్దానాలతో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారని, నిరుద్యోగుల మరణాలన్నీ ఆయన చేసిన హత్యలేనని ధ్వజమెత్తారు.

 శుక్రవారం నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో సంజయ్‌ మాట్లాడుతూ  రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకే కేసీఆర్‌ ప్రజల్లోకి రావడం ప్రారంభించారని చెప్పారు. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తానని ప్రకటించి.. ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ సమయంలో సేవలందించిన నర్సులను లాఠీలతో కొట్టించిన రాక్షసుడు కేసీఆర్‌ అని దుయ్యబట్టారు. 

తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి అనేక పార్టీలు పొత్తుకు తహతహలాడుతున్నాయని సంజయ్ వెల్లడించారు. అయితే తాము స్వతహాగా ఎదగడానికే ప్రాధాన్యమిస్తున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని సీఎం కేసీఆర్‌ కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

 సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశారని, దాంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సంజయ్  మండిపడ్డారు. ‘‘నీవు తాగి ఫాంహౌస్లో పడుకున్నావు. ఈ ఆత్మహత్యలకు కేసీఆరే కారణం’’ అని ఆరోపించారు. 

కోవిడ్ వచ్చి రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్నా బయటకు రాలేదని, బీజేపీ పొగ పెడితే ప్రగతి భవన్ నుండి మెల్లగా బయటికి వచ్చావని యెద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులకు వేసిన రైతు బంధు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు బ్యాంకులు కట్ చేసుకుంటున్నాయని, దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని ధ్వజమెత్తారు. 

‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను  నెరవేర్చకపోతే… నెరవేర్చే వరకు నీ వెంబడి భారతీయ జనతా పార్టీ పడుతుంది’’ అని సంజయ్  హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ ఒక పార్లమెంట్ నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 

కేంద్రం చేస్తున్న పనులను కూడా తామే చేయిస్తున్నట్లు డబ్బా కొట్టుకోవడం టీఆర్ఎస్ మానుకోవాలని సంజయ్ హితవు చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో సోమశిల నుంచి సిద్ధేశ్వరం వరకు మంజూరైన బ్రిడ్జి స్థలాన్ని ఆయన పరిశీలించి,  కృష్ణానదిలో పూజలు చేశారు. 

సోమశిల బ్రిడ్జి నిర్మాణం కోసం తామే కేంద్రమంత్రి చుట్టూ తిరిగామని స్పష్టం చేశారు. గొప్పలు చెప్పుకునే టీఆర్ఎస్ లీడర్లు కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.  నంద్యాల నుంచి కల్వకుర్తి వరకు రూ.800 కోట్ల నేషనల్ హైవే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించిందని సంజయ్ తెలిపారు. త్వరలోనే బ్రిడ్జితో పాటు జాతీయ రహదారి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.