తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ ‘సింగం’

 
`సింగం’గా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నామలై ని తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. కేంద్ర సహాయమంత్రిగా నియమితులైన ప్రస్తుత అధ్యక్షుడు ఎల్ మురుగన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేబడతారు. కరూర్ జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. 
 
ఒక వ్యవసాయ కుటుంభంలో జన్మించిన ఆయన తన గ్రామంలో మొదటి తరం గ్రాడ్యుయేట్. కోయంబత్తూర్ లోని పీఎస్జి టెక్నాలజీ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆయన, లక్నో ఇఇఎం లో ఎంబీఏ చేశారు. తర్వాత సివిల్ సర్వీస్ లో చేరిన అన్నామలై కుప్పుస్వామి 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 
 
కర్నాటకలో విధులు నిర్వర్తిస్తూ విధుల్లో నిక్కచ్చిగా ఉండటంతో ఆయనను ప్రజలు ముద్దుగా ‘సింగం’ అని పిలుచుకునేవారు. అంతేకాకుండా అత్యంత నిజాయితీపరుడైన అధికారిగా మన్ననలు పొందారు.
 
బెంగళూర్ సౌత్ డిసిపిగా, ఉడిపి, చిక్కమంగళూర్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఐపీఎస్ నుండి వైదొలిగి గత ఆగష్టు లో బీజేపీలో చేరారు. కరూర్ జిల్లాల అరవకురిచి నియోజకవర్గం నుండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పోటీచేసి డీఎంకే అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు.