బాధితులను బెదిరిస్తున్న బెంగాల్ పోలీసులు

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన హింసాకాండ బాధితులను పోలీసులు బెదిరిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) బృందం పేర్కొంది. రాష్ట్రంలో ప్రజలు పోలీసులంటే భయపడుతున్నారని తెలిపింది. బీజేపీకి ఓటు వేయడమే ప్రజల తప్పుగా మారిపోయిందని పేర్కొంది.

ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై దర్యాప్తు జరిపేందుకు వచ్చిన ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం సభ్యుడు అతిఫ్ రషీద్ గురువారం ముర్షీదాబాద్ పోలీసు సూపరింటెండెంట్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అతిఫ్ మాట్లాడుతూ, ప్రజలు పోలీసులంటే భయపడుతున్నారని పేర్కొన్నారు.

 వారు చేసిన తప్పు బీజేపీకి ఓటు వేయడమేనన్నారు. ఓటు వేసినందుకు పోలీసులు ఎందుకు హింసిస్తున్నారని ప్రశ్నించారు. ఫిర్యాదు చేయవద్దని బాధితులను పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. ఎన్నికల అనంతర హింసాకాండపై దర్యాప్తు కోసం తాను వచ్చినపుడు జూన్ 29న తనపై జాదవ్‌పూర్‌లో దాడి జరిగిందని అతిఫ్ చెప్పారు. 

జాతీయ మైనారిటీల కమిషన్ ఉపాధ్యక్షుడు కూడా అయిన అతిఫ్ పశ్చిమ బెంగాల్‌‌లో ఎన్నికల అనంతర హింసాకాండపై దర్యాప్తు కోసం వచ్చారు. ఆయన పర్యటన జూలై 6న ప్రారంభమైంది. జూలై 9 వరకు ఈ దర్యాప్తు కొనసాగుతుంది. 

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన హింసాకాండపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు కోసం ఎన్‌హెచ్ఆర్‌సీ జూన్ 21న ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ రాజీవ్ జైన్‌ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించింది.