ఒపెక్ దేశాల మధ్య వివాదంతో పెట్రోల్ ధరలు భారం!

ముడి చ‌మురు స‌ర‌ఫ‌రా చేసే ఓపెక్ ప్ల‌స్ దేశాల కూట‌మి దేశాల మధ్య వివాదం ముదురుతుండడంతో పెట్రోల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదనే ఆందోళన చెలరేగుతుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. దీంతో వ‌చ్చేనెల‌లో ఎంత ముడి చ‌మురు ఉత్ప‌త్తి చేయాల‌న్న విష‌యం ఖ‌రారు కాలేదు. పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాల‌న్న వ్యూహం సౌదీ అరేబియాది.. కానీ త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా రోజువారీ ఉత్ప‌త్తి పెంచుకునేందుకు అనుమ‌తించాల‌ని యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ డిమాండ్‌ చేస్తున్నది.
సయోధ్య కోసం రెండు దేశాల మధ్య రహస్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నా వారి మ‌ధ్య ప్ర‌తిష్ఠంభ‌నకు తెర పడటం లేదు. ఇప్ప‌టికిప్పుడు ముడి చ‌మురు ఉత్ప‌త్తి పెంపు సాధ్యమ‌య్యే సంకేతాలు క‌నిపించ‌డం లేదు. ఒక‌వైపు ఆర్థిక రంగం రిక‌వ‌రీ దిశ‌గా అడుగులు వేస్తున్న స‌మ‌యంలో ముడి చ‌మురు కొర‌త స‌రికొత్త స‌మ‌స్య‌కు దారి తీయొచ్చు. ఓపెక్ ప్ల‌స్ స‌భ్య దేశాల మ‌ధ్య ఐక్య‌త కొర‌వ‌డితే గ‌తేడాది మాదిరిగానే ప్రైస్ వార్ పున‌రావ్రుతం కానున్న‌ది.
ఇప్పటికే, 2014 సంవత్సరం తరువాత తిరిగి ముడి చమురు ధరలు భారీగా పెరిగి  ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి .బ్రెంట్‌(అట్లాంటిక్‌ బేసిన్‌ క్రూడ్‌ఆయిల్‌) బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ 0.8 శాతం పెరిగి  77.78 డాలర్లకు చేరుకుంది. అక్టోబర్‌ 2018 నుంచి ఈ స్థాయిలో బ్యారెల్‌ ధరలు పెరగలేదు. 
 
యుఎఈ, ఇతర ఒపెక్ దేశాలు ఆగస్టులో ఉత్పత్తిని పెంచడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే భారత్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయి. సుమారు 13 రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర సెంచరీ దాటేసింది. ఈ ధరలు తిరిగి తగ్గేట్గుగా కనిపించట్లేదు.

ఓపెక్ ప్ల‌స్ స‌భ్య దేశాలు పోటీ ప‌డి ముడి చ‌మురు ఉత్ప‌త్తి చేస్తే ధ‌ర‌లు ప‌త‌న‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితి చాలా సంక్లిష్ఠంగా మారింది. ఒపెక్ ప్ల‌స్ స‌భ్య దేశాల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోతే ముడి చ‌మురు స‌ర‌ఫ‌రా ప‌రిస్థితి మ‌రింత క‌ఠినం అవుతుంది.

అదే జ‌రిగితే సెప్టెంబ‌ర్ నాటికి బ్యారెల్‌ బ్రెట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర 80 డాల‌ర్లకు పెరుగుతుంద‌ని క‌న్స‌ల్టెన్సీ సంస్థ యూబీఎస్ అన‌లిస్ట్ జియోవ‌న్నీ స్టౌనోవో చెప్పారు. ఒక‌వేళ ముడి చ‌మురు ఉత్ప‌త్తి-స‌ర‌ఫ‌రాపై అంగీకారానికి రాక‌పోతే వ‌చ్చే నెల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు ప‌త‌నం అవుతాయ‌ని భావిస్తున్నారు.

అయితే, వ‌చ్చేనెల‌లో చ‌మురు ఉత్ప‌త్తి, ముడి చ‌మురు ధ‌ర‌పై క్లారిటీ రావ‌డానికి కొన్ని రోజులు ప‌డుతుంద‌ని సౌదీ ఆరామ్ కో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మ‌రో క‌న్స‌ల్టెన్సీ సంస్థ ఐఎన్‌జీ మాత్రం వ‌చ్చే నెల‌లో ముడి చ‌మురు ఉత్ప‌త్తి మార‌క‌పోతే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌రింత పైపైకి దూసుకెళ్తాయ‌ని అంచ‌నా వేస్తున్న‌ది.

ఒపెక్ స‌భ్య దేశాలు వ‌చ్చే నెల‌లో భారీ మొత్తంలో ముడి చ‌మురు ఉత్ప‌త్తిని పెంచ‌క‌పోవ‌చ్చున‌ని ఐఎన్జీ క‌మోడిటీస్ స్ట్రాట‌ర్జీ అధిప‌తి వారెన్ ప్యాట‌ర్స‌న్ చెప్పారు. ఒప్పందం కుద‌ర‌క‌పోతే గ‌తేడాది మాదిరిగా ప్రైస్ వార్ త‌ప్ప‌క పోవ‌చ్చున‌ని ఐఎన్జీ వ్యాఖ్యానించింది. ముడి చ‌మురు ఉత్ప‌త్తి పెంచ‌క‌పోతే మాత్రం బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర 85-90 డాల‌ర్ల మ‌ధ్య త‌చ్చాడుతుంద‌ని ఇండ‌స్ట్రీ క‌న్స‌ల్టెన్సీ సంస్థ ఎఫ్జీసీ తెలిపింది.