భారతదేశంలోని స్వేచ్ఛను, మత సామరస్యాన్ని తాను పూర్తిగా అనుభవిస్తున్నానని, ప్రాచీన భారత విజ్ఞానాన్ని పునరుద్ధరించడానికి తాను కట్టుబడి ఉన్నానని టిబెట్ ఆధ్మాత్మిక గురువు దలై లామా ప్రకటించారు. తన 86వ జన్మదినం సందర్భంగా మంగళవారం దలై లామా ఇక్కడి తన నివాసం నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రపంచ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియచేస్తూ మానవ సేవను తన తుది శ్వాస వరకు కొనసాగిస్తానని, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడతానని తెలిపారు. శరణార్థిగా మారిన తాను భారతదేశంలో స్థిరపడి ఇక్కడి స్వేచ్ఛను, మత సామరస్యాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నానని దలై లామా పేర్కొన్నారు.
మతంతో సంబంధం లేకుండా ధర్మం, కరుణ, అహింస వంటి లౌకిక విలువలు పాటిస్తున్న భారతీయ సిద్ధాంతాన్ని తాను అభినందిస్తున్నానని ఆయన కొనియాడారు. ప్రజలంతా అహింసా సిద్ధాంతాన్ని పాటించి ఒకరితో మరొకరు ప్రేమపూర్వకంగా మెలగాలని ఆయన తన జన్మదినం సందర్భంగా పిలుపునిచ్చారు.
“నేను ఒక మానవ మాత్రుడిని మాత్రమే. చాలా మంది నా పట్ల నిజంగా ప్రేమ చూపిస్తున్నారు. చాలా మంది నిజానికి నా చిరునవ్వును ప్రేమిస్తారు. నా వృద్ధాప్యం ఉన్నప్పటికీ, నా ముఖం చాలా అందంగా ఉంది. చాలా మంది నాకు నిజమైన స్నేహాన్ని చూపిస్తున్నారు” అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
తన పట్ల నిజంగా ప్రేమ, గౌరవం, నమ్మకాన్ని చూపించిన నాతన స్నేహితులందరికీ ఆయన తన ప్రశంసలను తెలిపారు. తన మానవ సహోదరులు అందరికి ఈ సందర్భంగా అహింస, కరుణ పాటిస్తామని, తమ జీవితాంతరం వరకు ఆచరిస్తూ ఉంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన కోరారు.
ఇలా ఉండగా, : టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 86వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న దలైలామాకు మోదీ ఫోన్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు.
మోదీ ఓ ట్వీట్‌లో, తాను ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఫోన్ చేశానని, 86వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపానని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఈశాన్య టిబెట్‌లోని ఆమ్‌డో, తక్ట్‌సేర్ శివారు ప్రాంతంలో 1935 జూలై 6న ఓ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయనకు రెండేళ్ల వయసు ఉన్నపుడు 13వ దలైలామా థుమ్‌బ్టెన్ గియాట్సో పునరవతారంగా గుర్తింపు పొందారు.
మొదట్లో ఆయన పేరు ల్హామో ధోన్‌డుప్. 1950లో టిబెట్‌పై చైనా దండయాత్ర తర్వాత సంపూర్ణ రాజకీయ అధికారాన్ని చేపట్టాలని ఆయనను ఆహ్వానించారు. 1959లో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవాసంలోకి వెళ్ళవలసి వచ్చింది. అప్పటి నుంచి ఆయన భారత దేశంలోని ధర్మశాలలో నివసిస్తున్నారు.
More Stories
బిఎస్ఎఫ్ కు 142.79 ఎకరాల భూమి అప్పగింత
ట్రంప్ ‘అబ్రహాం అకార్డ్’ మెలికతో ఇరకాటంలో పాక్
కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దు నిద్ర వల్లే అన్నదాతల కన్నీరు