ఎలాంటి ఆందోళన చెందవద్దని, తాను వారితో ఉన్నానని చెబుతూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) రెబల్ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఎన్డీఏలోకి కొత్తగా చేరిన లోక్సభ ఎంపీలతో ప్రధాని మోదీ తన నివాసంలో శుక్రవారం ఉదయం అల్పాహార సమావేశం నిర్వహించారు.
గత నెలలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి ఏక్నాథ్ షిండే శివసేనలో చేరిన ఏడుగురు ఎంపీలు, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో చేరిన 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు, అజిత్ పవార్ ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలతో సహా సుమారు 45 మంది ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి సర్వోన్నత దేవాలయమని, చర్చలలో చురుకుగా పాల్గొనాలని ప్రధాని మోదీ వారిని కోరారు.
సమావేశాల్లో అంతరాయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గందరగోళం కారణంగా కొత్త ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం లభించడం లేదని పేర్కొన్నారు. కాగా, షిండే సేనలో చేరిన ఏడుగురు మాజీ ఉద్ధవ్ సేన ఎంపీలతో ప్రధాని మోదీ మరాఠీలో మాట్లాడారు. వారికి అన్ని విధాలా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ‘ఎన్డీఏ ఒక కుటుంబం. మేము భాగస్వామ్య పార్టీలతో ఉన్నాం. ప్రతి వ్యక్తికి గౌరవం, అవకాశం లభిస్తుంది. నేను ఎన్డీఏలోని కేవలం ఒక భాగస్వామ్య పార్టీతోనే కాదు, ప్రతి ఎంపీతో ఉన్నాను. నేను ఎన్డీఏలోని ప్రతి ఎంపీకి అండగా నిలుస్తాను. మీరు ఎవరి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని వారితో చెప్పారు.
మరోవైపు నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి తమ అధికారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆ ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. ‘మీ ప్రాంతంలో ఏ అభివృద్ధి పని కోసమైనా నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంవో) సంప్రదించండి. పేద కార్మికులు, రైతులతో సహా అందరినీ కలవండి, ప్రతి ఒక్కరి సమస్యలను అర్థం చేసుకోండి’ అని వారితో పేర్కొన్నారు.
వర్షాకాల సమావేశాల సందర్భంగా చట్టసభ సభ్యులతో కొనసాగిస్తున్న సంప్రదింపులలో భాగంగా, ప్రధాని మోదీ తన అధికారిక నివాసంలో 37 మంది బీజేపీ పార్లమెంటు సభ్యులతో విందు సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది.పరిపాలన, పార్లమెంటరీ వ్యవహారాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి, అలాగే పార్టీలో సమన్వయాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ అనధికారిక సమావేశం జరిగింది.
More Stories
యువతరంతో మరింతగా మమేకం కావాలి.. భగవత్
‘జెన్ జెడ్’ ఆవేదన నిజమైనది, … వారిని గుడ్డిగా నమ్ముతాను
గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవం