మీ కుమార్తెలకు ఎగరడానికి రెక్కలు ఇవ్వండి

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. యానిమేటెడ్‌ వీడియోలు, జీఐఎఫ్‌లతో కథలు చెప్పే బోహ్రా సిస్టర్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 
 
ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ తమ కుమార్తెలకు అవగాహన కల్పించాలని కేంద్ర మంత్రి కోరారు. ఈ యానిమేటెడ్‌ వీడియోలో ఓ చిన్న అమ్మాయి విచారకమైన ముఖంతో.. చేతిలో చీపురుతో నిలబడి ఉంది. ఆమె కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయి.
అయితే ఆమె చిరిగిన దస్తులు బదులుగా.. పాఠశాల యూనిఫాం వేసుకోవడంతో.. తక్షణమే ఆమె ముఖం వెలిగిపోతుంది. ‘‘మీ కుమార్తెలకు ఎగరడానికి రెక్కలు ఇవ్వండి.’’ అనే క్యాప్షన్‌తో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. 1,42,594 మంది నెటిజన్లు వీక్షించారు.
వందల మంది లైక్‌ కొట్టి.. కామెంట్‌ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘ చాలా చక్కటి సందేశం.. ఇది చాలా ముఖ్యమైనది.’’ అంటూ కామెంట్‌ చేశారు. ఇక మరో నెటిజన్‌ ‘‘ నిజంగా ఇది ఎంతో బాగుంది. మీ కుమార్తెలను బడి బాట పట్టించండి.’’ అని రాసుకొచ్చారు.